సర్కార్ భూములపై కబ్జాదారుల కన్ను.. కోట్ల విలువైన ల్యాండ్ స్వాహా.?

దిశ, శేరిలింగంపల్లి : అవి పక్కాగా సర్కార్ స్థలాలని తెలుసు అందుకే యథేచ్ఛగా అందులో పాగా వేస్తున్నారు కొందరు కబ్జారాయుళ్లు. చెరువు శిఖాలు, పోరంబోకు భూములు, ఏళ్ల తరబడి ఎలాంటి కంచెలు లేని జాగాలపై కబ్జాకోరులు గద్దల్లా వాలిపోతున్నారు. ఎక్కడ ఖాళీస్థలం ఉంటే అక్కడ ఎంచక్కా పాగా వేసేస్తున్నారు. ఇందుకు ఈ డివిజన్.. ఆ డివిజన్.. అనే తేడా ఏమీలేదు. ఇలాంటి వారికి కొందరు నాయకులు, ఇంకొందరు అధికారులు సపోర్ట్ చేస్తుండడంతో ఈ కబ్జాల పరంపర ఎంచక్కా […]

Update: 2021-11-30 02:11 GMT

దిశ, శేరిలింగంపల్లి : అవి పక్కాగా సర్కార్ స్థలాలని తెలుసు అందుకే యథేచ్ఛగా అందులో పాగా వేస్తున్నారు కొందరు కబ్జారాయుళ్లు. చెరువు శిఖాలు, పోరంబోకు భూములు, ఏళ్ల తరబడి ఎలాంటి కంచెలు లేని జాగాలపై కబ్జాకోరులు గద్దల్లా వాలిపోతున్నారు. ఎక్కడ ఖాళీస్థలం ఉంటే అక్కడ ఎంచక్కా పాగా వేసేస్తున్నారు. ఇందుకు ఈ డివిజన్.. ఆ డివిజన్.. అనే తేడా ఏమీలేదు. ఇలాంటి వారికి కొందరు నాయకులు, ఇంకొందరు అధికారులు సపోర్ట్ చేస్తుండడంతో ఈ కబ్జాల పరంపర ఎంచక్కా సాగిపోతోంది. రెవెన్యూ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, నోటీసులు ఇచ్చినా అవి బుట్టదాఖలు అవుతున్నాయే కానీ.. పట్టించుకున్న వారు కరువయ్యారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా చాలా డివిజన్లలో కబ్జాల పర్వం సాగుతూనే ఉంది.

ఇదీ వరస..

శేరిలింగంపల్లి మండల పరిధిలో చందానగర్, దర్గా హుస్సేన్ షావన్, గచ్చిబౌలి, గఫుర్ నగర్, గోపన్ పల్లి, గుట్టల బేగంపేట్, హఫీజ్ పేట్, ఇజ్జత్ నగర్, కంచ గచ్చిబౌలి, ఖాజాగూడ, ఖానామేట్, కొండాపూర్, కొత్తగూడ, మదీనాగూడ, మాదాపూర్, మక్తా మహబూబ్ పేట్, మియాపూర్, నలగండ్ల, నానక్ రాంగూడ, రాయదుర్గ్ ఖల్సా, రాయదుర్గ్ నౌ ఖల్సా, రాయదుర్గ్ పాయగా, రాయదుర్గ్ పాన్ మక్తా, రామన్నగూడ, శేరిలింగంపల్లి, శేరి నలగండ్ల, తారానగర్ రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కూకట్‌పల్లి మండల పరిధిలోకి వచ్చే బాగ్ అమీర్, హైదర్ నగర్, శంశీగూడ రెవెన్యూ గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిలో కొన్ని కోర్టు కేసుల్లో ఉండగా మరికొన్నింటిని ఆయా అవసరాల కోసం ప్రభుత్వం వినియోగిస్తున్నది. ఇక మిగతా భూముల్లో కొందరు అక్రమార్కులు పాగా వేసి వాటిని తమ సొంతం చేసుకునే పనిలో తలమునకలుగా ఉన్నారు. అందులో ప్రధానంగా కొన్ని డివిజన్ల పరిధిలోని నాయకులు మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూములను చెరబట్టి దర్జాగా నిర్మాణాలు సాగిస్తున్నారు.

అన్ని డివిజన్లలోనూ అదే తంతు..

మాదాపూర్ డివిజన్ పరిధిలో అధిక మొత్తంలో సర్కార్ స్థలాలు ఉన్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఇక్కడి భూములకు గజం లక్ష రూపాయలకు పైగానే ధర పలుకుతున్నది. దీంతో ఇక్కడ భూములకు ఫుల్ డిమాండ్ ఉంది. ఖానామెట్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే సర్కార్ స్థలాలకు ప్రభుత్వమే స్వయంగా అమ్మకాలు సాగించింది. అవి పోను మిగతా భూముల్లో చాలా వరకు ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులే పాగా వేశారు. ఇదే డివిజన్ పరిధిలోని సున్నం చెరువులో మట్టి తరలిస్తుండగా ఇటీవలే అధికారులు ట్రాక్టర్ సీజ్ చేశారు. ఈ భూ ఆక్రమణలో ఓ లీడర్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదే డివిజన్ పరిధిలోని మాతృశ్రీనగర్ మీదికుంట చెరువు శిఖంలో ఇండ్ల నిర్మాణాలు వెలిశాయి.

శేరిలింగంపల్లిలో గోపీనగర్, చాకలి చెరువు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. చందానగర్ సర్వే నెంబర్ 174తో పాటు 27, 28 ఇలా అనేక ప్రభుత్వ సర్వే నెంబర్లలోని భూములు క్రమంగా పరాధీనం అవుతున్నాయి. గచ్చిబౌలి డివిజన్ లో ఓ నాయకుడు ఏకంగా చెరువు శిఖంలోనే పాగా వేశాడు. నలగండ్లలోనూ అక్రమాలు షరామామూలుగా మారాయి. మియాపూర్, హైదర్ నగర్ డివిజన్లలోని వందలాది ఎకరాల్లోని ప్రభుత్వ స్థలాలు కోర్టు వివాదాల్లో ఉండగానే అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇక అల్వీన్ కాలనీ డివిజన్ భూములకు రెక్కలొచ్చాయి. చాలా స్థలాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వీటి వెనక ఎవరున్నారో తెలిసినా అధికారులు మిన్నకుండి చూస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొండాపూర్, హఫీజ్ పేట్‌లో అదే వరస. ఇక్కడ నిరుద్యోగులకు కేటాయించిన భూములు కూడా కొంతమంది పెత్తందారుల చేతుల్లో చేరాయి.

మచ్చుకు కొన్ని..

ప్రభుత్వ స్థలాలను, ప్రైవేట్, ప్రభుత్వాలకు మధ్య వివాదాల్లో ఉన్న భూములను కాపాడేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కబ్జారాయుళ్లు మాత్రం తమపని తాము యథేచ్ఛగా చేసుకుపోతున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. చందానగర్ సర్వే నెంబర్ 27లో శ్మశాన వాటిక కోసం వదిలిన స్థలాన్ని కూడా కబ్జా చేశారు కొందరు వ్యక్తులు. ఖానామెట్ లో సర్వే నెంబర్ 41, మియాపూర్ సర్వే నెంబర్ 100, 101, 44/1, హైదర్ నగర్ లో 103, అల్వీన్ కాలనీ సర్వే నెంబర్ 57లోని భూములు ఇలా చాలా స్థలాలు పరాధీనం అవుతూనే ఉన్నాయి. అయితే, సర్కారు స్థలాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, చెరువు శిఖాలలో నిర్మాణాలున్నా వాటిని తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించామని, ఇప్పటికే చాలా భూములను స్వాధీనం చేసుకున్నామని శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు తెలిపారు. కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News