ఎర్రమట్టికి బదులు మొరం.. ఇలా చేస్తే హరితహారం గోవిందా..?
దిశ, మల్లాపూర్ : ఉపాధి హామీ పనులలో భాగంగా నర్సరీలో మొక్కలు పెంచాలని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. మొక్కలు పెంపకానికి అనువుగా ఉండేందుకు బ్లాక్ కవర్లలో ఎర్రమట్టి, ఎరువు నింపి నర్సరీలో రకరకాల మొక్కలను పెంచాలని అధికారులు తెలిపారు. అయితే, అందుకు విరుద్ధంగా పంచాయతీ కార్యదర్శి వ్యవహరించాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలోని నర్సరీలో ఎర్రమట్టికి బదులు కవర్లలో మొరం నింపుతూ అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. ఈ విషయమై నర్సరీకి వెళ్లి […]
దిశ, మల్లాపూర్ : ఉపాధి హామీ పనులలో భాగంగా నర్సరీలో మొక్కలు పెంచాలని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. మొక్కలు పెంపకానికి అనువుగా ఉండేందుకు బ్లాక్ కవర్లలో ఎర్రమట్టి, ఎరువు నింపి నర్సరీలో రకరకాల మొక్కలను పెంచాలని అధికారులు తెలిపారు. అయితే, అందుకు విరుద్ధంగా పంచాయతీ కార్యదర్శి వ్యవహరించాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలోని నర్సరీలో ఎర్రమట్టికి బదులు కవర్లలో మొరం నింపుతూ అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. ఈ విషయమై నర్సరీకి వెళ్లి చూడగా కూలీలు నింపిన కవర్లలో ఎర్ర మట్టి బదులు మొరం ప్రత్యక్షమైంది.
కూలీలు మొరం నింపితే మొక్కలు పెరగవని కార్యదర్శికి చెప్పినా కూడా కార్యదర్శి వినలేదని సమాచారం. అవన్నీ మీకు అనవసరం నేను చెప్పింది చేయండంటూ హితవు పలికారని కూలీలు తెలిపారు. అంచనా వేసి నర్సరీలో ఏపుగా మొక్కలను పెంచి గ్రామాలను పచ్చదనంతో నింపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే పంచాయతీ కార్యదర్శి మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఎర్రమట్టికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో దానికి బదులుగా తక్కువ ధరలో దొరికే మొరం తీసుకువచ్చి నర్సరీలో పోసి మొక్కలను పెంచుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో కార్యదర్శి ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు చర్యలు చేపడితే ఎన్నో విషయాలు బయటపడే అవకాశం ఉంది.