ఆధునిక వ్యవసాయంపై రైతులకు శిక్షణ కలేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. వారానికి ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించాల్సిన వ్యవసాయాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఏ విధంగా పాటించాలో తెలియక రైతులు నష్టాలను చూడాల్సి వస్తోంది. రైతులు మూస పద్ధతుల ప్రకారమే సాగు చేయడంతో పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరగడంతోపాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. రైతుల శిక్షణల కోసమే నిర్మించిన రైతు వేదికలు ధాన్యం నిల్వ […]
దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. వారానికి ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించాల్సిన వ్యవసాయాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఏ విధంగా పాటించాలో తెలియక రైతులు నష్టాలను చూడాల్సి వస్తోంది. రైతులు మూస పద్ధతుల ప్రకారమే సాగు చేయడంతో పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరగడంతోపాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. రైతుల శిక్షణల కోసమే నిర్మించిన రైతు వేదికలు ధాన్యం నిల్వ చేసే గోదాములుగా మారిపోతున్నాయి.
శిక్షణ తరగతుల ఊసెత్తని అధికారులు
సాగు పనులు మొదలయ్యాయి. విత్తనాలు నాటడంలో రైతులు తలమునకలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయశాఖ అధికారులు రైతులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతి మంగళవారం లేదా వారంలో నిర్ధేశించిన రోజున శిక్షణా తరగతులు నిర్వహించాల్సి ఉండగా.. చాలా వరకు గ్రామాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగడం లేదు. దీంతో విత్తనాలను ఏ విధంగా నాటాలి, నాణ్యమైన విత్తనాలను ఎలా సేకరించాలి, విత్తన శుద్ధిని ఏ విధంగా చేయాలి, నకిలీ విత్తనాల భారీన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విత్తనాలు నాటే ముందు పొలాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనే అంశాలను రైతులు తెలుసుకోలేక పోతున్నారు.
వరి సాగులో వెదజల్లే ప్రక్రియను ఏ విధంగా చేపట్టాలి, వరి పొలం సిద్ధం చేసేందుకు ఎరువులను ఏ మేరకు వినియోగించాలని, డ్రం సీడ్ పద్దతులను ఎలా చేపట్టాలి వంటి అంశాలను రైతులకు వ్యవసాయాధికారులు సూచించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ ప్రబలినప్పటి నుంచి శిక్షణా తరగుతులను పూర్తిగా బంద్ పెట్టిన అధికారులు ఇప్పటి వరకు తిరిగి నిర్వహించడం లేదు.
పాత పద్ధతులతో పెరిగిన ఖర్చులు
ఆధునిక వ్యవసాయం ఏ విధంగా చేపట్టాలో రైతులకు సరైన అవగాహన లేక సాంప్రదాయ పద్ధతులనే వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగి వ్యవసాయం పెనుభారంగా మారుతోంది. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులను పొందే ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉన్నప్పటికీ వాటిని రైతులకు సూచించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. రైతులకు అవగాహన లేకుండా ఎక్కువ మోతాదులో ఎరువులను వాడటం, విత్తనాలను నాటడం, అధికంగా పురుగుల మందులు వినియోగించడం వంటివి చేస్తున్నారు. కూలీల అవసరం లేకుండా తక్కవ ఖర్చుతో యంత్రాల ద్వారా సాగు చేసే పద్ధతులు చాలా ఉన్నప్పటికీ వాటిని రైతులకు వివరించే కార్యక్రమాలు చేపట్టడం లేదు.
దేశంలో పత్తి బాగా పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నా సగటు ఉత్పత్తిలో వెనుకబడింది. గుజరాత్లో హెక్టారుకు సగటున 707 కిలోలు, హర్యానాలో 665 కిలోలు వస్తుంటే తెలంగాణలో 515 కిలోల దిగుబడి మాత్రమే వస్తోంది. వరిలోనూ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువగానే దిగుబడులు వస్తున్నాయి. రైతులకు సరైన సూచనలు, సలహాలు అందకపోవడం వలన దిగుబడులు రాక నష్టపోతున్నారు.
గోదాంలుగా రైతు వేదికలు
ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి ఒక్కో క్లస్టర్‌కు వ్యవసాయ విస్తరణాధికారి( ఏఈఓ)లను నియమించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక రైతువేదిక చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,604 రైతు వేదికలను నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపుగా రూ.573 కోట్లు ఖర్చు చేసింది. ఈ రైతు వేదికల ప్రధాన ఉద్దేశ్యం.. శిక్షణా తరగతులను అందించేందుకు, రైతులు సమావేశమయ్యేందుకు, ధాన్యం నిల్వ చేసుకునేందుకు వీటిని వినియోగించుకోవడానికి ప్రభుత్వం నిర్మించింది. కానీ శిక్షణా తరగతులు నిర్వహించకపోవడంతో కేవలం ధాన్యాన్ని నిల్వ చేసుకునే గోదాంలుగానే రైతువేదికలు ఉపయోగపడుతున్నాయి.