గ్రేటర్ లో బీజేపీకి నాయకుడేడీ..?
గ్రేటర్ లో బీజేపీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు నాయకుడు కరువయ్యాడు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగర కార్యవర్గాన్ని నియమించకోలేకపోతోంది. నియోజకవర్గాలు, డివిజన్ల వారీగా కమిటీలు వేయలేదు. పార్టీ కార్యక్రమాలపై స్పష్టత లేకుండా పోతోంది. నాయకులు, కార్యకర్తలను ఒక్క త్రాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో సిటీలో బలంగా నినదించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్, శివారులోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను కలుపుకుని 6 ప్రాంతాలుగా […]
గ్రేటర్ లో బీజేపీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు నాయకుడు కరువయ్యాడు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగర కార్యవర్గాన్ని నియమించకోలేకపోతోంది. నియోజకవర్గాలు, డివిజన్ల వారీగా కమిటీలు వేయలేదు. పార్టీ కార్యక్రమాలపై స్పష్టత లేకుండా పోతోంది. నాయకులు, కార్యకర్తలను ఒక్క త్రాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో సిటీలో బలంగా నినదించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్, శివారులోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను కలుపుకుని 6 ప్రాంతాలుగా విభజించింది. ఆరుగురు ఇన్ చార్జీలను నియమించింది. కానీ, ఆ ప్రాంతాలకు కూడా పూర్తిగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు నియోజకవర్గాల వారిగా, లేదా డివిజన్ల వారిగా పార్టీ కమిటీలను వేయలేదు. కార్యక్రమాలపై స్పష్టత లేదు. గతంలో ఎన్నడూ ఈ తరహా పార్టీ నియామకాలు లేవు. ప్రస్తుతం ఎన్నికల వేళ గ్రేటర్ పరిధిలోని నాయకులందరినీ ఒక్క త్రాటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కాకుండా నాయకత్వాన్ని వికేంద్రీకరించడంపై పార్టీ వర్గాల విమర్శలకు కారణమవుతోంది.
నాయకుల్లో అసంతృప్తి…
గ్రేటర్ హైదరాబాద్‌లోని నాయకులు ఎడమొహం పెడమొహంతో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నాయకులు డా.కె.లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, రాజాసింగ్, రాంచందర్ రావు, ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి మధ్య సమన్వయం కనిపించడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గ్రేటర్, రాష్ట్రంలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా నగర కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయన గతంలో పలుమార్లు రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. సీనియర్ల తీరుపై ఆయన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించిన సందర్భాలూ ఉన్నాయి. నగర రథసారథిని నియమించడంలో వీరంతా ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో రాష్ట్ర నాయకత్వం తన తీరు మార్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం చింతల రామచంద్రారెడ్డి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరే కేంద్ర ప్రభుత్వ పథకాలంటూ గ్రేటర్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధాన నాయకులు కూడా ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అయోమయం…
నియోజకవర్గాలు, డివిజన్లలో సీనియర్లు అయోమయంలో ఉన్నారు. గ్రేటర్‌లో ఎన్నికలు సమీపిస్తున్నందున కమిటీలు లేకపోవడంతో కార్యక్రమాల బాధ్యతలు ఎవరు తీసుకోవాలనేది వారిని తొలుస్తున్న ప్రశ్న. ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళాలి..? పార్టీ నినాదాన్నిఎలా వినిపించాలి? అనే స్పష్టత వారికి లేకుండా పోయిందనేది కిందిస్థాయి నాయకుల అభిప్రాయం. ఎల్ఆర్ఎస్, రెండు పడకగదుల పథకం, వరదల ఆర్థికసాయం వంటి విషయాలున్నా ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోంది. డివిజన్లలో పార్టీని బలోపేతం చేయడం కోసం కమిటీలు తప్పనిసరి చేయాలనేది డివిజన్ నాయకుల అభిప్రాయం. అభిమానులను, మద్దతుదారులను, తటస్థులను పార్టీవైపు నడిపించాలంటే కార్యవర్గం తప్పనిసరి అని కార్యకర్తలు పేర్కొంటున్నారు.