బర్డ్ ఫ్లూ ఫీవర్.. చికెన్ తినాలా.. వద్దా?
దిశ, తెలంగాణ బ్యూరో : బర్డ్‌ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ ప్రకటించగా, మంత్రులు తలసాని, ఈటల రాజేందర్ మాత్రం రాష్ట్రానికి ఇంకా వ్యాప్తి చెందలేదని, రాదంటూ వెల్లడించారు. అనుమానం ఉన్న ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇంకా తేలలేదని చెప్పారు. కానీ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లిలో సుమారు రెండు వేల కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ భయం మరింత పెరిగింది. ఫ్లూ […]
దిశ, తెలంగాణ బ్యూరో : బర్డ్‌ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ ప్రకటించగా, మంత్రులు తలసాని, ఈటల రాజేందర్ మాత్రం రాష్ట్రానికి ఇంకా వ్యాప్తి చెందలేదని, రాదంటూ వెల్లడించారు. అనుమానం ఉన్న ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇంకా తేలలేదని చెప్పారు. కానీ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లిలో సుమారు రెండు వేల కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ భయం మరింత పెరిగింది.
ఫ్లూ కలవరం..
పక్షిజాతికి ప్రాణసంకటంగా మారిన బర్డ్‌ఫ్లూ పట్ల రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ టాస్క్‌ఫోర్స్ కమిటీలను కూడా నియమించింది. పలు జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. బర్ట్‌ఫ్లూ వలస పక్షుల ద్వారా సంక్రమించే ప్రమాదం ఉందని గుర్తించి, పలు దేశాల నుంచి వలస వచ్చే పక్షుల విడిది కేంద్రాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఏపీ, కర్ణాటక రాష్ర్టాలను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వివిధ ప్రాంతాల్లో చనిపోయిన పక్షులకు బర్డ్‌ఫ్లూ లేదని పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, లాక్‌డౌన్ సమయంలో పూర్తిగా మూతపడిన ఫౌల్ట్రీ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో తాజాగా బర్డ్ ఫ్లూ రావడంతో ఫౌల్ట్రీ యజమానులు దిగాలు పడుతున్నారు.
వేగంగా వ్యాప్తి..
దేశంలో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇప్పటివరకు మొత్తం 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్టుగా కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ వినియోగంపై మాంసప్రియులను రకరకాలు ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో చికెన్ తినొచ్చా..? తింటే ఏమైనా సమస్యలు వస్తాయా..? అంటూ హైరానా పడుతున్నారు. గుడ్లు, చికెన్, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను సరిగ్గా ఉడికించి తీసుకుంటే ప్రమాదం ఉండదని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు రెండు రోజులుగా సమీక్ష నిర్వహించి చికెన్, గుడ్లు తినవచ్చంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై మాత్రం సరైన సమాధానాలు చెప్పడం లేదు.
భయం… భయం
తాజాగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లిలో కోళ్ల మృతులు కలకలం రేపుతున్నాయి. డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని ఓ కోళ్ల ఫారంలో సుమారు 2 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. నాలుగైదు రోజుల నుంచి వరుసగా ఒకట్రెండు కోళ్లు మృతి చెందుతున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి చనిపోతున్నట్లు గుర్తించారు. వెంటనే కోళ్ల ఫారం యజమాని రామచంద్రగౌడ్ అప్రమత్తమై పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు నాలుగైదు రోజుల క్రితం చనిపోయిన కోళ్ల కళేబరాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఆ రిజల్ట్ ఇంకా రాలేదు. అంతలోపే బుధవారం ఉదయం 2 వేల కోళ్లకు పైగా మృతి చెందడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మృతి చెందిన కోళ్లను సమీప అటవీ ప్రాంతంలో గుంత తీసి పూడ్చిపెడుతున్నారు. మరోవైపు తమ జిల్లాలో ఎక్కడ బర్డ్ ఫ్లూ వచ్చిందోనని భయపడి చాలామంది చికెన్ తినడం మానేస్తున్నారు.
చికెన్‌కు దూరం..
ఇక బర్డ్ ఫ్లూ కారణంగా రాష్ట్రంలో చికెన్ అమ్మకాలు నెమ్మదించాయి. చికెన్ ప్రియులు బర్డ్ ఫ్లూ భయంతో కోడి కూర తినేందుకు జంకుతున్నారు. వారం కిందట వరకు రూ.220 పలికిన ధర ఇప్పుడు పలుచోట్ల రూ.80 నుంచి రూ.60 మేర తగ్గినా కొనేందుకు ఇష్టపడకపోవడంతో ఆ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పండుగ సమయంలో కూడా చికెన్ అమ్మకాలు సాగడం లేదు.
తింటే ఏం కాదు… కేంద్రం ప్రకటన
‘‘వైరస్‌ను క్రియారహితం చేయడానికి పౌల్ట్రీ ఉత్పత్తులను 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల పాటు ఉండికించాల్సి ఉంటుంది. అప్పుడే గుడ్లు, చికెన్ సరిగా ఉడికి సురక్షితమైనవిగా మారతాయి. మంచి శుభ్రత పాటించి, సరైన విధంగా వండుకుని ఎప్పటిలాగే పౌల్ట్రీ ఉత్పతులును తినొచ్చు. బర్డ్ ఫ్లూ బయటపడ్డ ప్రాంతాల్లో కూడా చికెన్, గుడ్లను సరైన విధంగా ఉడికించి తీసుకుంటే ఎలాంటి వైరస్ సంక్రమించదు’’ అని కేంద్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ తాజాగా మరోసారి ప్రకటన విడుదల చేసింది.