ఒమిక్రాన్ ఎఫెక్ట్.. కుదేలైన స్టాక్ మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ పతనాన్ని చూశాయి. అంతర్జాతీయంగానే కాకుండా దేశంలో పెరుగుతున్న కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల ఆందోళనతో పాటు ఫెడ్ నిర్ణయాలు, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మధ్య మదుపర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. శుక్రవారం ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు కొంచెం కూడా కోలుకోలేకపోయాయి. ఐటీ రంగం మాత్రమే సానుకూలంగా కదలాడగా, మిగిలిన అన్ని రంగాలు కుదేలయ్యాయి. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు వంద దాటిపోవడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని […]

Update: 2021-12-17 06:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ పతనాన్ని చూశాయి. అంతర్జాతీయంగానే కాకుండా దేశంలో పెరుగుతున్న కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల ఆందోళనతో పాటు ఫెడ్ నిర్ణయాలు, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మధ్య మదుపర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. శుక్రవారం ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు కొంచెం కూడా కోలుకోలేకపోయాయి. ఐటీ రంగం మాత్రమే సానుకూలంగా కదలాడగా, మిగిలిన అన్ని రంగాలు కుదేలయ్యాయి. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు వంద దాటిపోవడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ క్రమంలోనే నిఫ్టీ ఇండెక్స్ 17 వేల మార్కు నుంచి దిగజారింది.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వేరియంట్ అనేక దేశాలకు వ్యాపించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇప్పటికే ఉన్న కొవిడ్ వ్యాక్సిన్‌లు ఎంతమేరకు దీనిపై పనిచేస్తున్నాయనే దానిపై కూడా స్పష్టత లేకపోవడం స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను పెంచడం, అమెరికా ఫెడ్ నిర్ణయాలు దేశీయ మార్కెట్లలో ప్రతికూల ర్యాలీకి కారణాలుగా నిలిచాయని నిపుణులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 889.40 పాయింట్లు పతనమై 57,011 వద్ద, నిఫ్టీ 263.20 పాయింట్లు నష్టపోయి 16,985 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఐటీ మినహా అన్ని రంగాలు పడిపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, టీసీఎస్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని కంపెనీల షేర్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, టైటన్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం షేర్లు అధికంగా నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.04 వద్ద ఉంది.

Tags:    

Similar News