తెలంగాణకు కొత్త ట్రిబ్యునల్?
దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల మాత్రమే తెలంగాణకు న్యాయమైన నీటి వాటా దక్కుతుందని, ఇంతకాలం జరిగిన అన్యాయానికి పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగానే పావులు కదపాలనుకుంటున్నట్లు తెలిసింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం కేంద్రంతో ఏ విధంగా సంప్రదింపులు జరపాలనే అంశంపై ఇప్పటికే పార్లమెంటు సభ్యులతో చర్చించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనందున ఎంపీలు ఢిల్లీ నుంచి చేసే ప్రయత్నాలకు అనుగుణంగా అవసరమైతే త్వరలో ఢిల్లీ వెళ్లి […]
దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల మాత్రమే తెలంగాణకు న్యాయమైన నీటి వాటా దక్కుతుందని, ఇంతకాలం జరిగిన అన్యాయానికి పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగానే పావులు కదపాలనుకుంటున్నట్లు తెలిసింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం కేంద్రంతో ఏ విధంగా సంప్రదింపులు జరపాలనే అంశంపై ఇప్పటికే పార్లమెంటు సభ్యులతో చర్చించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనందున ఎంపీలు ఢిల్లీ నుంచి చేసే ప్రయత్నాలకు అనుగుణంగా అవసరమైతే త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానిని కూడా కలిసే అవకాశం ఉంది.
గెజిట్‌లో పేర్కొన్న అంశాలను ఒక్కొక్కటి లోతుగా అధ్యయనం చేసిన సాగునీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను రూపొందిస్తున్నారు. దీన్ని కేసీఆర్ అధ్యయనం చేసిన తర్వాత లీగల్, సాంకేతిక అంశాలపై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నట్లు ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ నగరంలోని ‘జలసౌధ’లో సోమవారం ఆ శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. గెజిట్‌లోని అన్ని అంశాలపై కూలంకషంగా చర్చ జరిగింది. తెలంగాణకు ఈ గెజిట్ ద్వారా జరగనున్న అన్యాయం, రెండు రాష్ట్రాల మధ్య పెరగనున్న అగాధం, బోర్డు అధికారులకు పూర్తి పెత్తనం లభించడం ద్వారా సిబ్బంది ఎదుర్కొనే ప్రాక్టికల్ సమస్యలు తదితరాలపై చర్చించారు. గెజిట్‌లో పేర్కొన్న అప్రూవల్ లేని ప్రాజెక్టులు, ప్రాజెక్టులన్నీ పూర్తిగా బోర్డుల ఆధీనంలోకి వెళ్లడం, కేంద్ర భద్రతా బలగాల పహారా తదితర అంశాలపై చర్చించి రాష్ట్ర పరిధిలో ఉన్న సాగునీటి వ్యవహారాలన్నీ ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్లడం ద్వారా తలెత్తే సమస్యల గురించి చర్చించారు.
అనంతరం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసమే ఘర్షణ పడుతున్నామని, తెలంగాణ ఉద్యమం సమయంలో ‘నీళ్లు’ ఒక ప్రధాన నినాదంగా ఉన్నదని గుర్తు చేశారు. గెజిట్‌లోని లీగల్, సాంకేతిక అంశాలను పరిశీలించామని, అపెక్స్ కౌన్సిల్‌లో పెండింగ్ ప్రాజెక్టుల మీద విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత కూడా పాత ప్రాజెక్టులకు అప్రూవల్ లేదనే అంశాన్ని కేంద్రం పేర్కొన్నదని గుర్తుచేశారు.
తాజా గెజిట్‌లో పేర్కొన్న అప్రూవల్ లేని ప్రాజెక్టుల అన్ని వివరాలను బోర్డుకు సమర్పిస్తామని, డీపీఆర్‌లను కూడా ఇస్తామన్నారు. కేంద్ర మంత్రి చెప్పిన విధంగానే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నామన్నారు. కానీ న్యాయమైన నీటి వాటా కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అన్ని లీగల్ అంశాలను అన్వేషిస్తున్నదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి దశకు అప్రూవల్ కూడా వచ్చిందని గుర్తుచేశారు.
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నీటి పంపకాల విషయంలో కుదిరిన ఒప్పందం తాత్కాలికమైనదేనని, ఆ ఒక్క సంవత్సరానికి సంబంధించినదేనని రజత్ కుమార్ గుర్తుచేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 573 టీఎంసీల నీరు రావాల్సిన హక్కు ఉన్నదని, ఈ సంవత్సరం నుంచే ఫిఫ్టీ ఫిప్టీ నిష్పత్తిలో 405 టీఎంసీల నీటిని వాడుకోవడం మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో ఇప్పటికే కేసు విచారణ జరుగుతున్నదని, పూర్తి తీర్పు వచ్చేంత వరకు బోర్డుకు అధికారం వద్దంటూ అపెక్స్ కౌన్సిల్‌లో చెప్పినా ఫలితం లేకుండాపోయిందని వివరించారు. ఫుల్ బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తామని, జనాభా ప్రాతిపదికన, కృష్ణా బేసిన్ తెలంగాణలో ఉన్న విస్తీర్ణం లెక్కలను వివరిస్తామని, ఆ ప్రకారం నీటి వాటాను డిమాండ్ చేస్తామని తెలిపారు.