ఎన్నికల వేళ 'పల్లా'కు కొత్త తలనొప్పి

దిశ ప్రతినిధి, నల్లగొండ: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మూడు ఉమ్మడి జిల్లాలో క్రమంగా ప్రచారం చేసుకుంటూ వచ్చినా.. గత మూడు రోజుల నుంచి ప్రచార స్పీడ్‌ను పెంచారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పల్లాకు అనుకూలంగా లేకపోవడంతో మూడు జిల్లాల మంత్రులు రంగంలోకి దిగారు. దీంతోనైనా గ్రాడ్యుయేట్స్ ‘పల్లా’ వైపు మరోసారి చూస్తారా..? […]

Update: 2021-02-26 14:51 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మూడు ఉమ్మడి జిల్లాలో క్రమంగా ప్రచారం చేసుకుంటూ వచ్చినా.. గత మూడు రోజుల నుంచి ప్రచార స్పీడ్‌ను పెంచారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పల్లాకు అనుకూలంగా లేకపోవడంతో మూడు జిల్లాల మంత్రులు రంగంలోకి దిగారు. దీంతోనైనా గ్రాడ్యుయేట్స్ ‘పల్లా’ వైపు మరోసారి చూస్తారా..? లేదా అన్నది డౌటే. ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం.. సోషల్ మీడియా వేదికగా పల్లాకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారంతో టీఆర్ఎస్ శ్రేణులు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

తలనొప్పిగా నిరుద్యోగ భృతి..

ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ తేరపైకి తీసుకొచ్చిన నిరుద్యోగ భృతి అంశంపై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. వాస్తవానికి నిరుద్యోగ భృతి అంశం మంత్రి కేటీఆర్ ప్రస్తావన ముందు వరకు మూలకు పడింది. ఆ అంశాన్ని నిరుద్యోగులు పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. కానీ ఇటీవల నిరుద్యోగ భృతి తెరపైకి రావడం.. ప్రతిపక్షాలకు మంచి అస్త్రం దొరికినట్టయ్యింది. అసలే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేక తీవ్ర అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులను కదిపినట్టయ్యింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు వెళితే.. ప్రధానంగా నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్ల విషయంపై వ్యతిరేక ఎదురవుతోంది.

సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్..

సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై నెగిటివ్ టాక్ విపరీతంగా నడుస్తోంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు మొదలుకుని.. నిన్న మొన్న ఎమ్మెల్సీ నామినేషన్ నేపథ్యంలో సమర్పించిన అఫిడవిట్ వరకు ప్రతి అంశంపై నెగిటివ్ కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో సొంత కారు లేదని పేర్కొనడం వైరల్‌గా మారింది. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల విషయంలోనూ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సంబంధించిన అనురాగ్ విద్యా సంస్థల ప్రస్తావన వస్తోంది. ‘పోయిన ఎన్నికల్లో గెలిస్తే.. అనురాగ్ యూనివర్సిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే.. ఉస్మానియా యూనివర్సిటీకి తాళం పడ్తది’ అంటూ పల్లాను ట్రోల్ చేస్తుండడం గమనార్హం.

విమర్శలను తిప్పికొట్టలేకపోతున్న శ్రేణులు..

అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ మొదలుకుని.. ప్రొఫెసర్ కోదండరాం, చెరుకు సుధాకర్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న తదితర సోషల్ మీడియా అనుచర వర్గమంతా పల్లాపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటేయాలంటూ చేసిన టెలీకాలర్‌కు ఓ యువకుడు ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. గెలిచిన తర్వాత ఏనాడూ పట్టభద్రుల పక్షాన మాట్లాడిన దాఖాలాలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ శ్రేణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టలేకపోతున్నారు.

రంగంలోకి మంత్రులు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎంత ప్రయత్నించినా.. పల్లా రాజేశ్వర్ రెడ్డి పాజిటివ్ టాక్‌ను పూర్తిస్థాయిలో సాధించలేకపోతున్నారనే చెప్పాలి. మండలాల వారీగా ఇప్పటికే పార్టీ బాధ్యులను ఏర్పాటు చేసినా.. ఆశించిన ఫలితం కానరావడం లేదు. నిరుద్యోగులకు సోషల్ మీడియా ఆయుధంగా మారడం.. మొబైల్స్‌లో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం ప్రజాప్రతినిధులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. అసలే యువత.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం ప్రయత్నిస్తే.. సొంత నియోజకవర్గంలో అబాసుపాలయ్యే పరిస్థితులు ఉండడంతో ఎమ్మెల్యేలు సైతం అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. దీంతో పల్లా సొంత సర్వేలో ఆశించిన ఫలితాలు లేకపోవడంతో మంత్రులను రంగంలోకి దించారు. వరంగల్ జిల్లాకు సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్, నల్లగొండ నుంచి మంత్రి జగదీష్ రెడ్డి అంతా తామై వ్యవహరిస్తుండడం గమనార్హం. మంత్రులు స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా.. అవి ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News