తరుగు పేరిట దగా!

దిశ, కరీంనగర్: తరుగు తీస్తామని వారంటుంటే, తీయొద్దని వీరంటున్నారు. దీంతో వరిధాన్యం కొనుగోళ్లపై నీలినీడలు అలుముకున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా రైతులకు ఇబ్బంది లేకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కరోనా బారిన పడకుండా తాము ధాన్యం అమ్ముకోవచ్చని రైతులు సంబరపడ్డారు. రైతుల్లో ఈ ఒక్క ఆనందం తప్ప మిగతావన్నీ కష్టాన్ని పంచుతున్నాయి. వరి కోయాలంటే అధికారులు టోకెన్ ఇవ్వాలి. అప్పుడే పొలంలోకి హార్వెస్టర్ దిగాలి. పంట […]

Update: 2020-04-23 02:09 GMT

దిశ, కరీంనగర్: తరుగు తీస్తామని వారంటుంటే, తీయొద్దని వీరంటున్నారు. దీంతో వరిధాన్యం కొనుగోళ్లపై నీలినీడలు అలుముకున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా రైతులకు ఇబ్బంది లేకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కరోనా బారిన పడకుండా తాము ధాన్యం అమ్ముకోవచ్చని రైతులు సంబరపడ్డారు. రైతుల్లో ఈ ఒక్క ఆనందం తప్ప మిగతావన్నీ కష్టాన్ని పంచుతున్నాయి. వరి కోయాలంటే అధికారులు టోకెన్ ఇవ్వాలి. అప్పుడే పొలంలోకి హార్వెస్టర్ దిగాలి. పంట కోసిన తర్వాత తేమ, తాలు లేకుండా చేసి కొనుగోలు కేంద్రానికి తరలించాలి. అక్కడ మిల్లర్లు తరుగు పేరిట ఎంత తరుగు తీస్తామంటే అంతకు ఒప్పుకుని ధాన్యం అమ్ముకోవాలి. ఇది ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తంతు.

కాళేశ్వరం జలాలు సమృద్ధిగా రావడంతో తొలి ఫలితాన్ని అనుభవించిన రైతులు పంట బాగా పండిందన్న సంతృప్తిని మిగుల్చుకున్నారు తప్ప లాభం చేకూరే అవకాశాలు కనిపించడం లేదని వాపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర బాగున్నా అధికారులు, మిల్లర్ల చర్యలు తమకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయని రైతులు వాపోతున్నారు.

టోకెన్ల జారీ తంతు..

కోతకు వచ్చిన పొలాలను గుర్తించి క్షేత్ర స్థాయిలో టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలువురు రైతులు మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేశారు. తమ పంట అమ్ముకునేందుకు టోకెన్లను సకాలంలో ఇవ్వడంలేదని మంత్రి ముందు వాపోయారు. జారీ అయిన టోకెన్లు పలుకుబడి ఉన్నవారికి మొదటి ప్రాధాన్యతలో అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తరుగు మోసం..

కరోనా కష్టకాలం తెచ్చిపెట్టిన గోనె సంచుల కొరత ప్రభావం కూడా రైతులపై తీవ్రంగానే పడుతోంది. గతంలో 70 కిలోల బరువు తూగే సంచులకు బదులు ఈసారి 40 కిలోల సంచుల వినియోగిస్తున్నారు. ఒక్కో సంచికి రెండున్నర కిలోల మేర తరుగు తీస్తామని మిల్లర్లు అంటున్నారని రైతులు వాపోతున్నారు. సైదాపూర్ మండలం రాయికల్‌లో తరుగు విషయంలో మిల్లర్లు రైతులతో వాగ్వాదానికి దిగారు. మంత్రి ఈటల ధాన్యాన్ని పరిశీలించేందుకు వెళ్లినప్పుడు రైతులు తరుగు పేరిట జరుగుతున్న దోపిడీ గురించి చెప్పుకొచ్చారు. దీంతో మంత్రి ఈటల కూడా మిల్లర్ల చర్యలను తప్పు పట్టారు. మిల్లర్ల వైఖరిలో మార్పు రావాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

పెద్దపల్లి జిల్లాలో…

పెద్దపల్లి జిల్లాలో కూడా మిల్లర్ల మాయాజాలానికి రైతులు బలవుతున్నారని జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆందోళన వ్యక్తం చేశారు. సుల్తానాబాద్ కు చెందిన ఓ మిల్లును పరిశీలించిన మధు నేరుగా మంత్రి గంగుల కమలాకర్ ను కలిసి వివరించారు. మంత్రి గంగుల సంబంధిత అధికారులతో మాట్లాడి ఇలాంటి పరిస్థితి పునరావృతం కావొద్దని ఆదేశించారు. లేనట్టయితే తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల జిల్లా రైతులు కూడా ఆందోళన చేపట్టారు. జిల్లాలోని పెగడపల్లి మండలం ల్యాగల మర్రి రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపారు. తరుగు పేరిట నిట్టనిలువునా దగా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈసారి మిల్లర్లు తరుగు పేరిట ఎక్కువ మొత్తంలో ధాన్యానికి కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతులు అంటున్నారు. సాధారణంగా ఒక్కో బ్యాగుకు 600 గ్రాముల నుంచి కిలో వరకు సంచి బరువుతో కలిపి తరుగు ఉంటుందని ఈసారి మిల్లర్లు ఎక్కువగా తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్ల మాయాజాలం కారణంగానే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు వివరిస్తున్నారు. దీంతో ఈ సీజన్ లో వరి ధాన్యం కొనుగోళ్లలో తరుగు వల్ల ప్రభుత్వానికి తలనొప్పి తయారయ్యేలా ఉంది. ఆదిలోనే ఈ సమస్యకు చెక్ పెట్టకపోతే మరింత జటిలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Tags: Karimnagar, farmers, misery, loss of paddy grain, sales, minister spea

Tags:    

Similar News