వెకిలి ప్రకటనలకు..కౌంటర్ బాయ్‌కాట్

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం ఎన్నో మతాలకు పుట్టినిల్లు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత వారసత్వం. ఎవరి మత విశ్వాసాలను, నమ్మకాలను అగౌరవపరచకుండా ప్రతి పండుగను అందరూ కలిసి చేసుకోవడం భారతీయుల ప్రత్యేకత. మత సంప్రదాయాలు, ఆచారాలకు మన దేశంలో పెద్దపీట వేస్తారు. అందుకే మనదేశంలో మత సామరస్యం పరిఢవిల్లుతోంది. ఇలాంటి విషయాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద దుమారాన్ని రేపి..మత హింసను ప్రేరేపిస్తోంది. అందుకే సున్నితమైన ఈ అంశాలపై పిచ్చి పిచ్చి ప్రకటనలు రూపొందించొద్దు. మొన్న […]

Update: 2020-10-23 01:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం ఎన్నో మతాలకు పుట్టినిల్లు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత వారసత్వం. ఎవరి మత విశ్వాసాలను, నమ్మకాలను అగౌరవపరచకుండా ప్రతి పండుగను అందరూ కలిసి చేసుకోవడం భారతీయుల ప్రత్యేకత. మత సంప్రదాయాలు, ఆచారాలకు మన దేశంలో పెద్దపీట వేస్తారు. అందుకే మనదేశంలో మత సామరస్యం పరిఢవిల్లుతోంది. ఇలాంటి విషయాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద దుమారాన్ని రేపి..మత హింసను ప్రేరేపిస్తోంది. అందుకే సున్నితమైన ఈ అంశాలపై పిచ్చి పిచ్చి ప్రకటనలు రూపొందించొద్దు. మొన్న తనిష్క్ ఈ విషయంలో తప్పటగుడు వేసి యావత్ హిందువుల ఆగ్రహానికి గురైంది. తాజాగా ఈరోస్ నౌ దసరా నవరాత్రి ఉత్సవాలపై అతి నీచమైన ద్వందార్థాలతో ప్రకటనలు రూపొందించి మరోసారి అదే పొరపాటు చేసి చేతులు కాల్చుకుంది.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన ఓటీటీ ఈరోస్‌ నౌ రూపొందించే కార్యక్రమాలన్నీ బోల్డ్ కంటెంట్స్. సినిమాల్లో బూతు ఉంటే సెన్సార్ వాళ్లు కట్ చేసి ఏకిపారేస్తారు. కానీ, ఓటీటీలో ఆ విషయంలో సెన్సార్ జోక్యం లేకపోవడంతో ఆయా సంస్థల విచ్చలవిడితనానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని సినీ విశ్లేషకులు, నెటిజన్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బూతుకు బోలెడు డిమాండ్ ఉంది కదా అని, ఈరోస్ నౌ బూతుతోనే తమ సంస్థ వర్ధిల్లుతుంది అని, అన్నిటికీ ఒకటే మందు అన్నట్లు ప్రతి విషయానికీ బూతును జోడిస్తే బొక్కాబోర్ల పడక తప్పదు. అలా దసరా నవరాత్రుల సందర్భంగా ఆ బూతును..పండుగలకు ఆపాదించి పెద్ద తప్పిదం చేసింది.

దేవీ నవరాత్రులతో మొదలయ్యే దసరా ఉత్సవాలు..పదో రోజు విజయ దశమితో ముగుస్తాయి. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. అందుకే ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుస్తూ, తొమ్మిది రకాల నైవేద్యాలు, స్తోత్రాలతో దుర్గామాతను పూజిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులను (పసుపు, ఆకుపచ్చ, బూడిద, నారింజ, తెలుపు, ఎరుపు, నీలం, గులాబీ, ఊదా ) ధరించడం కూడా సంప్రదాయంగా వస్తోంది. కాగా, ఈరోస్‌ నౌ హీరోయిన్లతో ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులతో ద్వందార్థాలు స్ఫురించే వ్యాఖ్యలతో ఆయా పోస్టర్లు డిజైన్ చేసింది. నెటిజన్ల ఆయా రంగు దుస్తుల ఫొటోలను పంచుకోవాల్సిందిగా తెలిపింది. తాము పోస్ట్ చేసిన హీరోయిన్లు ఫొటోలు బోల్డ్‌గా ఉండటంతోపాటు ఆ వ్యాఖ్యలు హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉండటంతో.. నెటిజన్లు ‘ఈరోస్ నౌ’పై ఆగ్రహానికి గురయ్యారు. బాయ్‌కాట్ ఈరోస్ నౌ (#BOYCOTTEROSNOW)ట్రెండ్‌ చేస్తూ ఆగ్రహం ప్రదర్శించారు. ఈరోస్ నౌ సీఈవో ముస్లిం కావడంతో వివాదం మరింత ముదిరింది.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈరోస్ నౌపై మండిపడింది. ఓటీటీ ఫ్లాట్ ఫాం అనేది నీలి చిత్రాలకు అడ్డాగా మారిందని ఆమె కామెంట్ చేసింది. ఈరోస్ చేసిన పనికి సిగ్గుపడుతున్నానని అన్నారు. ‘సినిమా అనేది ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక బలమైన మాధ్యమం. దానిని మనం కాపాడుకోవాలి. ఆ అనుభవాన్ని పొందాలి. కానీ, డిజిటలైజేషన్ వల్ల అది సాధ్యం కాదు. పెద్దస్థాయిలో ప్రేక్షకులను అది ఆకర్షించలేదు. ఓటీటీ అనేది పోర్న్ హబ్‌లా మారింది’అని కంగనా ట్వీట్ చేసింది.

దిగొచ్చిన ఈరోస్..

సర్వత్రా విమర్శలు రావడంతో ఈరోస్ నౌ దిగివచ్చింది. ఈరోస్‌ బృందం తాము చేసిన పోస్టుల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందున ఆ ఫొటోలు డెలిట్‌ చేయడంతోపాటు నెటిజన్లను క్షమాపణ కోరింది. మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. భారత్‌లోని విభిన్న సంస్కృతుల పట్ల తమకు గౌరవభావం ఉందని, తాము షేర్‌ చేసిన పోస్టుల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా వాటిని తక్షణమే తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఈరోస్‌ నౌ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఏ మత సంప్రదాయాన్నైనా గౌరవించే విజ్ఞత భారతీయులది. వెకిలి ప్రకటనలతో చిచ్చు రేపకుండా ఉంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటినట్లే. ఇకనైన దర్శకులు, సంస్థలు ప్రకటన విషయంలో జాగ్రత్త వహించాలి. సున్నితమైన అంశాలను టచ్ చేసేప్పుడు అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఓ ప్రకటనతో మన జనాలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం. దానివల్ల సమాజానికి కలిగే లాభమేంటి? నష్టమేంటి?అని బేరీజు వేసుకోవాలి.

Tags:    

Similar News