నిజాలను నిర్భయంగా చెబితే బెదిరిస్తారా..? ఇది ముమ్మాటికీ గూండాయిజమే..
మహబూబాబాద్ / ములుగు : నిజాలను నిర్భయంగా రాస్తూ ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారం చేరవేస్తున్న ‘దిశ’ పత్రిక రిపోర్టర్ పై గుండాయిజం చెలాయించే ప్రయత్నం చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే అనుచరుల వ్యవహారంపై వరంగల్ రాజకీయ నేతలు, జర్నలిస్టుల సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ఎమ్మెల్యేపైనే వార్త రాస్తావా… నీ అంతు చూస్తా’ అంటూ ఓ జడ్పీటీసీ దిశ పత్రిక వరంగల్ ప్రతినిధిని ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడిన విషయం […]
మహబూబాబాద్ / ములుగు : నిజాలను నిర్భయంగా రాస్తూ ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారం చేరవేస్తున్న ‘దిశ’ పత్రిక రిపోర్టర్ పై గుండాయిజం చెలాయించే ప్రయత్నం చేసిన మహబూబాబాద్ ఎమ్మెల్యే అనుచరుల వ్యవహారంపై వరంగల్ రాజకీయ నేతలు, జర్నలిస్టుల సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ఎమ్మెల్యేపైనే వార్త రాస్తావా… నీ అంతు చూస్తా’ అంటూ ఓ జడ్పీటీసీ దిశ పత్రిక వరంగల్ ప్రతినిధిని ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వ్యవహార శైలిని తీవ్రంగా ఖండించారు. ఎవరి స్పందన ఎలా ఉందంటే..
దిశపై బెదిరింపులు హేయనీయం..
పత్రికా, మీడియా స్వేచ్ఛను టీఆర్‌ఎస్ ప్రభుత్వం, నాయకులు అణిచివేస్తోంది. మానుకోటలో ఎమ్మెల్యేపై మమత అనే అమ్మాయి పోస్టర్లు వేసిన అంశంపై వార్తను ప్రచురించిన దిశ మీడియా ప్రతినిధిపై బెదిరింపులకు దిగడం హేయనీయం. నెల్లికుదురు జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డిపై వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. రాష్ట్రంలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. మీడియాను ప్రభుత్వం గుప్పిట పట్టే ప్రయత్నం చేస్తుండగా, దిశ పత్రిక స్వతంత్రంగా వార్తలను ప్రచురిస్తోంది. నిజాలను నిర్భయంగా రాస్తున్న దిశ మీడియా ప్రతినిధిపై బెదిరింపులకు పాల్పడటాన్ని అన్ని వర్గాల ప్రజలు ఖండించాలి. గూండాయిజం చూపిన నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరుపున అవసరమైతే పోరాటం చేస్తాం.
-ములుగు, ఎమ్మెల్యే సీతక్క
ఎమ్మెల్యే గూండాయిజం నశించాలి.
మహబూబాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రజా ప్రతినిధుల రౌడీయిజం రోజురోజుకూ మితిమీరి పోతోంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అండదండలతో ఆయన అనుచరులు జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. భూ మాఫియా, రౌడీలకు టీఆర్ఎస్ పార్టీ నిలయంగా మారింది. సామాన్య మధ్యతరగతి ప్రజలు టీఆర్ఎస్ ప్రతినిధుల ఆగడాలను చూసి భయబ్రాంతులకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారు. వరంగల్ దిశ ప్రతినిధిని బెదిరింపులకు పాల్పడిన నెల్లికుదుర్ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి పై పోలీస్‌శాఖ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వెనుక ఉండి నడిపిస్తున్న మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ రాజీనామా చేయాలి.
-బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్ నాయక్
జర్నలిస్ట్‌లను బెదిరించడం హేయనీయం..
నిజాలను నిర్భయంగా ప్రచురిస్తున్న దిశ దినపత్రిక ప్రతినిధిపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నెల్లికుదుర్ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులకు పాల్పడటం నిజంగా హేయమైన చర్య. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఓ మహిళ పేరు తో వేసిన వాల్ పోస్టర్ పై వార్త రాసినందుకు దిశ ప్రతినిధి బెదిరింపు లకు గురి చేయడంను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పత్రిక స్వేచ్ఛను హరిచడం సరికాదన్నారు. జర్నలిస్టుల పక్షాన ఐజేయూ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. వెంటనే అధికారపార్టీ నాయకులు, నెల్లికుదుర్ జడ్పీటీసీ జర్నలిస్టులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
-టీయూడబ్ల్యూజే యూ(ఐజేయూ), జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
నెల్లికుదురు జడ్పీటీసీపై కేసు నమోదు చేయాలి
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెరిగాయి. మహబూబాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఆగడాలు రోజురోజుకు పెరిగి పోవడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పేద ప్రజల పక్షాన నిజాన్ని నిక్కచ్చిగా రాస్తున్న దిశ దిన పత్రిక ఆదరణ చూడలేక టీఆర్ ఎస్ కుట్ర చేస్తోంది. బెదిరింపులకు పాల్పడిన నెల్లికుదుర్ జట్పీటీసీపై చర్యలు తీసుకోవాలి. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వెంటనే దిశ యాజమాన్యానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
-సీపీఐ ఎంఎల్ (ఎన్డీ) జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య
మహబూబాబాద్‌లో శంకర్ నాయక్ రౌడీయిజం
టీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలు, దోపిడీలు ఎక్కువ అయ్యాయి. రౌడీలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్నారు. జరిగిన ఘటనను వార్తగా పాఠకులకు అందించినా తట్టుకోలేకపోవడం వారి గూండాయిజాన్ని బయటపెడుతోంది. మానుకోటలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ రౌడీయిజం ఎక్కువ అవుతుంది. దిశ పత్రిక ప్రతినిధిపై బెదిరింపులకు గాను పోలీస్‌శాఖ, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నెల్లికుదుర్ జడ్పీటీసీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.
-బీజేపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు, రాంచందర్ రావు
దమ్మున్న పత్రిక దిశ..
నిజాన్ని నిర్భయంగా రాస్తున్న దిశ దినపత్రికకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అధికార పార్టీ నాయకులు జర్నలిస్టులను బెదిరించడం సరికాదు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ప్రశ్నించే వారి గొంతులను నొక్కేస్తున్నారు. నెల్లికుదుర్ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.
-ఆదివాసీ సంఘము (తుడుం దెబ్బ) అధ్యక్షుడు వట్టేం ఉపేందర్
జడ్పీటీసీ బహిరంగ క్షమాపణ చెప్పాలి :
నిర్బయంగా వార్తలు రాస్తున్న దిశ పత్రినిధిపై బెదిరింపులకు పాల్పడటం దారుణం. వెంటనే పోలీసులు నెల్లికుదురు జడ్పీటీసీపై చర్యలు తీసుకోవాలి. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి.
-డోలి సత్యనారాయణ, టీజేఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు
బెదిరించడం గూండాయిజమే..
తెలంగాణ ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను నొక్కివేయడం, నేరుగా బెదిరించడం రౌడీయిజమే. రాష్ట్రంలో ప్రశ్నించే విధానంపై స్వరాష్ట్రం ఏర్పాటు అయ్యింది. వెంటనే టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు బహిరంగ క్షమాపణ చెప్పాలి.
-మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్
శంకర్ నాయక్‌ను తరిమికొట్టేరోజులు దగ్గర పడ్డాయి..
మానుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అమోఘమైనది. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడటం అహంకరానికి నిదర్శనం. ఎమ్మెల్యే శంకర్ నాయక్, నెల్లికుదుర్ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డిలపై కేసులు నమోదు చేయాలి.