ఏడేళ్లుగా బీటీపీఎస్ భూనిర్వాసితుల పడిగాపులు
దిశ, ఖమ్మం ప్రతినిధి: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ కరెంటు కష్టాలు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రభుత్వం అనువైన చోట పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది. దానిలో భాగంగానే బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్) ఏర్పాటైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దీన్ని సుమారు 1100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంత వరకు బాగానే ఉన్నా పవర్ ప్లాంట్ కోసం చేసిన భూ సేకరణ అప్పట్లో తీవ్ర వివాదంగా మారింది. నిర్వాసితులకు పలు […]
దిశ, ఖమ్మం ప్రతినిధి: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ కరెంటు కష్టాలు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రభుత్వం అనువైన చోట పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది. దానిలో భాగంగానే బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్) ఏర్పాటైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దీన్ని సుమారు 1100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంత వరకు బాగానే ఉన్నా పవర్ ప్లాంట్ కోసం చేసిన భూ సేకరణ అప్పట్లో తీవ్ర వివాదంగా మారింది. నిర్వాసితులకు పలు హామీలు ఇచ్చి ఎలాగోలా భూసేకరణ పూర్తి చేశారు. ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండు యూనిట్లు పూర్తయ్యాయి. సీఓడీ (కమర్షియల్ ఆపరేషన్ డేట్) కూడా వచ్చింది. ప్లాంట్ కోసం భూములిచ్చి దాదాపు ఏడేండ్లు గడిచాయి. భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు బుట్టదాఖలయ్యాయి.. వారి బతుకులు రోడ్డున్న పడ్డాయి. నేటికీ నిర్వాసితులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్యాకేజీ కోరుకున్న కొంత మందికి డబ్బులు కూడా ఇవ్వలేదు. మా భూములిచ్చి రోడ్డున పడ్డామని నిర్వాసితులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇదీ బీటీపీఎస్ సామర్థ్యం..
తెలంగాణ ప్రభుత్వం మణుగూరు, పినపాక మండలాల్లో దాదాపు 1100 ఎకరాల్లో.. 1080 (24X70) మెగావాట్ల సామర్థ్యంతో.. రూ. 10వేల కోట్ల అంచనాతో.. సుమారు 20 ఏజెన్సీల ఆధ్వర్యంలో.. 3500 మంది కార్మికులతో జెన్కో, భెల్ తరఫున 200 మంది ఇంజినీర్ల పర్యవేక్షణలో బీటీపీఎస్ నిర్మాణం చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ ఉండగా.. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండాలని అదే జిల్లాలో భద్రాద్రి ప్లాంట్ ను సైతం నిర్మిస్తోంది. దీనికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నారు. నాలుగు యూనిట్లు గల ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు జెన్కో, భెల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. 2014లోనే ఈ ప్లాంటుకు సంబంధించి పనులు మొదలు పెట్టడం, భూ సేకరణ పనులు ప్రారంభించారు. 2015 మార్చి 28న సీఎం కేసీఆర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు రెండు యూనిట్లు నిర్మాణం అయిపోయి సీవోడీ కూడా పూర్తయింది.
మొదట ప్లాంట్‌ను వ్యతిరేకించినా..
ప్లాంట్ నిర్మాణం చేపట్టిన మణుగూరు, పినపాక మండలాలు గిరిజన మండలాలు. ఈ ప్రాంతంలో ఏది చేయాలన్న గిరిజన చట్టాలకు లోబడి చేయాలి. పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రతిపాదన వచ్చినప్పడు మొదట ఆ మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గ్రామ సభలు పెట్టిమరీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి వారిని ఒప్పించారు. ప్లాంటు ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివద్ధి చెందుతుందని, రాష్ట్రం కూడా కరెంటు కష్టాల నుంచి బయటపడుతుందని వారికి నచ్చజెప్పారు. నిర్మాణానికి కావాల్సిన భూమి సైతం ఇవ్వాలని కోరారు. 2014లోనే భూ సేకరణ పనులు కూడా ప్రారంభించారు.
అమలుకు నోచుకోని హామీలు..
ప్రభుత్వం మణుగూరు, పినపాక మండలాల్లో బీటీపీఎస్ కోసం దాదాపు 1100 ఎకరాల్లో భూమి సేకరించింది. ప్లాంట్ నిర్మాణానికి జెన్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. భూసేకరణ సైతం ఆ సంస్థే చేపట్టింది. ప్లాంట్ కోసం దాదాపు 400 మంది నుంచి భూమి సేకరించింది. ఆ సమయంలో వారికి ప్యాకేజీ, ఉద్యోగాలను ప్రకటించింది. కొంత మంది ప్యాకేజీకి ఒప్పుకోగా, మరికొంత మంది ఉద్యోగాలు కావాలన్నారు. 2014లో భూమి సేకరించిన సంస్థ ఇప్పటి వరకు వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్యాకేజీ కూడా కొంత మందికి ఇచ్చి చేతులు దులుపుకుంది. అప్పటి నుంచి భూమి ఇచ్చిన కుటుంబాలు తమ జీవితాలను వెళ్లదీసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
పట్టించుకోని ప్రభుత్వం
పరిహారం కోసం బాధితులు ఎన్ని సార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా చేద్దాం అంటున్నారే తప్ప న్యాయం మాత్రం జరగడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. దాదాపు ఏడేండ్లు కావొస్తున్నా వారికి మాత్రం ఉద్యోగం ఇవ్వలేదు. కనీసం వారిని పట్టించుకోవడం కూడా మానేశారు. గతంలో ఉన్న ఎమ్మెల్యేను, ప్రస్తుత ఎమ్మెల్యేను కలిసినా ఏం లాభం లేదంటున్నారు బాధితులు. అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటి వరకు ఎవరికీ క్లియరెన్స్ ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పటికే రెండు యూనిట్లు పూర్తయ్యాయి.. ఆ రెండు యూనిట్లలో కూడా భూములిచ్చిన ఎవరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పించలేదు. కొంతమందికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం కల్పించినా వారికి ఇప్పుడు కనీస వేతనం కూడా అమలు కావడం లేదు.
ఏడేండ్లుగా దిక్కులేదు
మా భూములు తీసుకుని ఏడేండ్లు అవుతున్నది. మాకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వలేదు. కనీసం మేం అడుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.. మా కుటుంబాన్ని చాలా దీనస్థితిలో నెట్టుకొస్తున్నాం. ఇప్పటికే ప్లాంట్ రెండు యూనిట్లు పూర్తిచేసుకుంది. అయినా మా సమస్యకు పరిష్కారం లభించలేదు. మంచిగా పండే భూములను ధారాదత్తం చేశాం.. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మాకు ఉద్యోగాలు కల్పించాలి.
-సంతోశ్ రెడ్డి, భూ నిర్వాసితుడు
తిరిగి తిరిగి విసిగిపోయాం..
బీటీపీఎస్ కోసం 2014లో మా భూములిచ్చాం. అయినా ఇప్పటి వరకు మాకు ఉద్యోగాలివ్వలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాం.. మాకు వయసు కూడా అయిపో వస్తున్నది. ఎప్పుడు ఉద్యోగాలిచ్చేది? మేం ఎప్పుడు సర్వీస్ చేసేది.. మా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నాం.. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేను సైతం కలిశాం.. డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసినాక సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇక మా వల్ల కాదు.. మేం చేపట్టబోయే కార్యాచరణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
-శోభన్, భూ నిర్వాసితుడు
ఈ వారంలో పూర్తి చేస్తాం..
డీఎల్సీ మీటింగ్ అయిపోయాక సమస్యను పరిష్కరిస్తాం.. దాదాపు ఈ వారంలోనే పూర్తవుతుంది.. కలెక్టర్ సెలవులో ఉండటం వల్ల కొంత ఆలస్యం జరిగింది. భూ నిర్వాసితుల విషయమై మంత్రి కేటీఆర్‌తో కూడా చర్చించాం.. త్వరలోనే వారికి ఉద్యోగాలిస్తాం.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వారంలోపే సమస్య పరిష్కారం కావచ్చు.
-రేగా కాంతారావు, పినపాక ఎమ్మెల్యే