కరీంనగర్-వరంగల్ హైవే పనులపై నీలినీడలు!
దిశ, కరీంనగర్ సిటీ: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా పేరుగాంచిన వరంగల్‌కు జిల్లా నుంచి ప్రయాణం చేయడం ప్రయాసగా మారుతోంది. గంటన్నరలో చేరాల్సిన 80కిలోమీటర్ల దూరం, మూడు గంటలైనా చేరుకోలేని పరిస్థితులు నెలకొనడంతో ఈ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో భారీ, మధ్య తరహా వాహనాల రాకపోకలు సాగించే ఈరోడ్డు శిథిలావస్థకు చేరగా, ప్రజా ప్రతినిధుల్లో పట్టింపు కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ రహదారుల పరిధిలోకి.. రాష్ట్ర […]
దిశ, కరీంనగర్ సిటీ: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా పేరుగాంచిన వరంగల్‌కు జిల్లా నుంచి ప్రయాణం చేయడం ప్రయాసగా మారుతోంది. గంటన్నరలో చేరాల్సిన 80కిలోమీటర్ల దూరం, మూడు గంటలైనా చేరుకోలేని పరిస్థితులు నెలకొనడంతో ఈ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో భారీ, మధ్య తరహా వాహనాల రాకపోకలు సాగించే ఈరోడ్డు శిథిలావస్థకు చేరగా, ప్రజా ప్రతినిధుల్లో పట్టింపు కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జాతీయ రహదారుల పరిధిలోకి..
రాష్ట్ర రహదారుల శాఖ పరిధిలో ఉన్న ఈ రోడ్డు కొన్నాళ్ల క్రితమే జాతీయ రహదారుల సంస్థ పరిధిలోకి వెళ్లినా, మరమ్మతులు చేపట్టడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లా నుంచి కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్, నాగపూర్ ప్రాంతాల నుంచి కూడా వాణిజ్య అవసరాల కోసం రైల్వే జంక్షన్ అయిన కాజీపేటతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, తదితర ప్రాంతాలకు ఈ రోడ్డు మీదుగానే రాకపోకలు కొనసాగుతుంటాయి. అయితే, పర్యవేక్షణ లోపంతో రహదారి అస్తవ్యస్తంగా మారగా, ఐదు మాసాల క్రితం వరుసగా కురిసిన వర్షాలకు మరింత దారుణంగా మారింది. దీంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే జంకుతున్నారు.
హుస్నాబాద్ మీదుగా..
నిత్యం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు వందలాది మంది వయా హుస్నాబాద్ మీదుగా ప్రయాణాలు సాగిస్తున్నారు. శారీరక అలసటతో పాటు ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని వాపోతున్నారు. పలు ప్రజా సంఘాలు చేసిన ఫిర్యాదులతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్పందించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రోడ్డు పరిస్థితిని వివరించారు. వెంటనే విస్తరణ పనులు చేపట్టాలని రెండు మాసాల క్రితం ఎన్‌హెచ్ఏఐ అధికారులను ఆదేశిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు.
భూసేకరణలో అంతరాయం
సంబంధించిన ప్రణాళికలు రూపొందించిన అధికారులు, భూసేకరణపై కూడా దృష్టి సారించినా పనుల్లో వేగం పుంజుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల భూసేకరణలో అంతరాయం కలుగుతున్నట్లు అధికారులు పేర్కొంటుండగా కరీంనగర్-వరంగల్ రహదారిపై ఎంపీ సంజయ్ కుమార్ ఇప్పటికే రెండు సార్లు జాతీయ రహదారుల సంస్థ అధికారులతో సమీక్షించారు. అయినా ఫలితం లేకపోవడంతో విస్తరణ పనులకు మోక్షమెప్పుడు కలుగుతుందోనని, ఈ రోడ్డు గుండా రోజూ వచ్చి పోయే ప్రయాణికులు వేచి చూస్తున్నారు.