దశాబ్ద కనిష్టానికి సహజ వాయువు ధర

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా మారిన పరిస్థితుల కారణంగా దేశీయంగా సహజవాయువు (Natural gas) ధర దశాబ్ద కనిష్ఠానికి తగ్గే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గ్యాస్ ఎగుమతి దేశాల ప్రామాణిక రేట్లను గమనిస్తే మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్(MBTU) ధర 1.9 నుంచి 1.94 డాలర్ల స్థాయికి తగ్గే అవకాశముందని, ఇది దశాబ్ద కనిష్ఠ స్థాయి అని ఈ పరిణామాలతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ, వాహన సీఎన్‌జీ, వంట గ్యాస్ తయారీలో ఈ […]

Update: 2020-08-17 08:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా మారిన పరిస్థితుల కారణంగా దేశీయంగా సహజవాయువు (Natural gas) ధర దశాబ్ద కనిష్ఠానికి తగ్గే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గ్యాస్ ఎగుమతి దేశాల ప్రామాణిక రేట్లను గమనిస్తే మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్(MBTU) ధర 1.9 నుంచి 1.94 డాలర్ల స్థాయికి తగ్గే అవకాశముందని, ఇది దశాబ్ద కనిష్ఠ స్థాయి అని ఈ పరిణామాలతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి.

విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ, వాహన సీఎన్‌జీ, వంట గ్యాస్ తయారీలో ఈ సహజ వాయువును (Natural gas) ఉపయోగిస్తారు. దీని ధరను ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తుంది. అక్టోబర్ 1న జరగబోయే గ్యాస్ ధర సమీక్షలో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

కాగా, సహజ వాయువు ధరను తగ్గిస్తే దేశీయ సంస్థ ఓఎన్‌జీసీ (Domestic company ONGC)కి మరిన్ని నష్టాలు తప్పేలా లేవు. గ్యాస్ మిగులు దేశాల రేట్ల ప్రామాణికంగా 2014లో ప్రభుత్వ కొత్త గ్యాస్ నియమాలను ప్రవేశపెట్టిన తర్వాత నుంచి దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్‌పై ఓఎన్‌జీసీ (ONGC)కి నష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే, ప్రస్తుతం నిర్ణయించిన 2.39 డాలర్ల ధర వల్ల గిట్టుబాటు అవ్వదని ఓఎన్‌జీసీ సంస్థ ప్రభుత్వానికి నివేదించింది. ఇదివరకు గ్యాస్ విభాగంలోని నష్టాలను చమురు నుంచి భర్తీ చేసేది. ప్రస్తుతం పరిస్థితుల్లో చమురు వ్యాపారం (Oil business) సైతం ఒత్తిడిలో ఉన్నందున కంపెనీకు కష్టాలు తప్పట్లేదు.

Tags:    

Similar News