రాజ్యసభలో జగదీప్ ధన్ ఖర్ వర్సెస్ జయాబచ్చన్

రాజ్యసభలో ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్, సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ, నటి జయా బచ్చన్‌ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది.

Update: 2024-08-09 10:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభలో ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్, సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ, నటి జయా బచ్చన్‌ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. జయాబచ్చన్ పేరుని జయా అమితాబ్ బచ్చన్ గా రాజ్యసభ ఛైర్మన్ ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతుండగా కూర్చోవాలని కోరారు. కాగా.. ఛైర్మన్ తీరుపై జయాబచ్చన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభ గందరగోళంగా మారింది. ఛైర్మన్ మాట్లడుతూ.. "జయాజీ, మీరు గొప్ప పేరు సంపాదించారు. నటుడు దర్శకుడికి లోబడి ఉంటాడని మీకు తెలుసు. నేను ఈ పదవి నుంచి చూసిన దాన్ని మీరు చూడలేదు. నాకు పాఠాలు చెప్పొద్దు. మీరు సెలబ్రెటీ కావచ్చు. కానీ, పద్ధతులు మాత్రం పాటించాల్సిందే” అని జగదీప్ ధన్ ఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఛైర్మన్ తనకు క్షమాపణ చెప్పాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు. జయాబచ్చన్ కు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ నిలిచారు. ఛైర్మన్ వైఖరిని నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి.

క్షమాపణలు చెప్పాలని డిమాండ్

రాజ్యసభలో జరిగిన రగడ గురించి జయ మీడియాతో మాట్లాడారు. ‘‘ఛైర్మన్ వాడిన స్వరాన్ని వ్యతిరేకిస్తూ. మేం స్కూల్ పిల్లలం కాదు. మాలో కొందరు సీనియర్ సిటిజెన్లు కూడా ఉన్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు నిల్చున్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరుని చూస్తే భాదకలిగింది. మైక్ కట్ చేశారు. ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారు? సెలబ్రిటీ అయితే ఏంటి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను ఐదోసారి రాజ్యసభ ఎంపీగా ఉన్నాను. ఏం మాట్లాడాలోనాకు తెలీదా? దీనిపై ఛైర్మన్ క్షమాపణలు చెప్పాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.


Similar News