Hezbollah : ఇరాన్‌పై దాడి జరిగిన వెంటనే.. ఇజ్రాయెల్‌పైకి హిజ్బుల్లా రాకెట్ల వర్షం
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్‌పై ఇజ్రాయెల్(Israel) ప్రతీకార దాడులు చేసిన వెంటనే.. లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా(Hezbollah) చెలరేగింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్‌పై ఇజ్రాయెల్(Israel) ప్రతీకార దాడులు చేసిన వెంటనే.. లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా(Hezbollah) చెలరేగింది. ఇజ్రాయెల్‌లోని పలు పట్టణాలు లక్ష్యంగా దాదాపు 80కిపైగా రాకెట్లు, మిస్సైళ్లను సంధించింది. జనావాసాల్లో ఇవి పడటంతో ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంత నిఘా విభాగం ప్రధాన కార్యాలయమున్న మీషార్ సైనిక స్థావరంపైనా రాకెట్లు పడినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ దక్షిణ ప్రాంతంలోని వైమానిక స్థావరంపై డ్రోన్లతో హిజ్బుల్లా దాడి చేసింది. హిజ్బుల్లా దాడులతో ఇజ్రాయెలీ పట్టణాల్లో గంటల తరబడి సైరన్ల మోత కొనసాగింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్(Iran) ప్రతిదాడి చేసే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలతో చాలావరకు విమానయాన సంస్థలు ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ మీదుగా విమాన సర్వీసులను రద్దు చేశాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆయా విమాన సర్వీసులను నడుపుతున్నాయి.
మరణం అంచుల్లో ఉత్తర గాజా ప్రజానీకం : ఐరాస
పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో 22 మంది చనిపోయారు. ఉత్తర గాజాలోని ప్రస్తుత పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి మానవతా సాయం విభాగం సారథి జాయ్స్ మసూయ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెలీ దళాలు కనీస మానవీయ విలువలు లేకుండా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయన్నారు. ‘‘ఆస్పత్రులు లేవు. వైద్య సిబ్బంది లేరు. మానవతా సాయం అందే అవకాశం లేకుండా పోయింది. ఉత్తర గాజాలోని యావత్ ప్రజానీకం మరణం అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నారు’’ అని జాయ్స్ మసూయ పేర్కొన్నారు.
ఈ దాడిలో మా పాత్ర లేదు : అమెరికా
మధ్యవర్తిత్వ దేశాల ద్వారా ఇరాన్‌తో తాము టచ్‌లోనే ఉన్నామని అమెరికా వెల్లడించింది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ ప్రతిస్పందిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇంతటితో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ ఆగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిలో తమ పాత్ర లేనే లేదని అమెరికా వైట్ హౌస్ స్పష్టం చేసింది. పశ్చిమాసియా దేశాలు సంయమనం పాటించాలని భారత విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరింది.