మీరు ఎప్పటికీ నా కుటుంబ సభ్యులే..వయనాడ్ ప్రజలకు రాహుల్ భావోద్వేగ లేఖ
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో వయనాడ్‌ను వీడనున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వయనాడ్ ప్రజలకు ఆదివారం లేఖ రాశారు. ‘వయనాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా. మీడియా ముందు నిలబడి నా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీరు నా కళ్లలో దుఃఖాన్ని చూసి ఉంటారు. నేను ఎందుకు బాధగా ఉన్నానంటే. ఐదేళ్ల కిందట నేను మిమ్మల్ని మొదటిసారి కలిశాను. అప్పుడు నేను మీకు పరిచయం కూడా లేదు. అయినప్పటికీ నన్ను విశ్వసించారు. మీ అపారమైన ప్రేమ, ఆప్యాయతతో నాకు ఆశ్రయం ఇచ్చారు. నేను ప్రతి రోజూ అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు మీ ప్రేమ నన్ను రక్షించింది. మీరు నాకు ఆశ్రయం, ఇల్లు, కుటుంబం అయ్యారు. మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ‘వయనాడ్‌లో మీకు ప్రాతినిధ్యం వహించేందుకు నా సోదరి ప్రియాంక సిద్ధంగా ఉన్నారు. నన్ను ఆదరించినట్టు తనను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. మీరు అవకాశం ఇస్తే ఎంపీగా ఆమె మీకు సేవలు అందిస్తుంది. మీరు నాకు ఎప్పటికీ కుటుంబ సభ్యులే. మీలో ప్రతి ఒక్కరికీ నేను అండగా ఉంటా’ అని తెలిపారు.