'ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక హోదాను టచ్ చేయం'.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

ఈశాన్య రాష్ట్రాలు లేదా దేశంలోని పలు ప్రాంతాలకు వర్తించే ప్రత్యేక హోదా నిబంధనల్లో సవరణలు చేసే ఆలోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Update: 2023-08-23 14:23 GMT

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలు లేదా దేశంలోని పలు ప్రాంతాలకు వర్తించే ప్రత్యేక హోదా నిబంధనల్లో సవరణలు చేసే ఆలోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటికి రాజ్యాంగం కల్పించిన రక్షణ యథావిధిగా కొనసాగుతుందని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేసిన అంశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారించింది.

ఓ పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మనీష్ తివారీ, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. "గతంలో జమ్మూ కాశ్మీర్‌‌కు ఆర్టికల్ 370 వర్తించేది. దాన్ని నిర్వీర్యం చేశారు. దానిలాగే ఈశాన్య రాష్ట్రాలకు ఆర్టికల్ 371లోని ఆరు ఉప భాగాలు వర్తిస్తాయి. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ అస్సాం, త్రిపుర, మేఘాలయాలకు వర్తిస్తుంది. వాటి విషయంలోనూ కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చనే ఆందోళన నెలకొంది" అని న్యాయవాది మనీష్ తివారీ పేర్కొన్నారు.

దేశ సరిహద్దుల్లో ఉండే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజల్లో ఏ చిన్న ఆందోళన, అభద్రతా భావం రేకెత్తినా తీవ్రమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. మణిపూర్‌ హింసాకాండలో 150 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారని ఆయన గుర్తుచేశారు. దీనిపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ.. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు కశ్మీర్ కంటే విభిన్నమైనవని, వాటి ప్రత్యేక హోదా నిబంధనల్లో జోక్యం చేసుకునే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు లేవని, అలాంటి భయాందోళనలను ఎవరూ సృష్టించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.


Similar News