Bahraich violence: బహ్రెయిచ్ అల్లర్లు.. నేపాల్ కి పారిపోతుండగా నిందితులపై కాల్పులు

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా హింస చెలరేగింది. కాగా.. ఈ కేసులో ఇద్దరు నిందిలపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

Update: 2024-10-17 12:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా హింస చెలరేగింది. కాగా.. ఈ కేసులో ఇద్దరు నిందిలపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 13న దుర్గాదేవి విగ్రహ ఊరేగింపులో 22 ఏళ్ల రాంగోపాల్ మిశ్రాను హత్య చేసిన ఇద్దరు నిందితులు సర్ఫరాజ్, ఫహీమ్ నేపాల్‌కు పారిపోతుండగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో నిందితులిద్దరి కాళ్లకు గాయాలయ్యాయి. నిందితులిద్దరూ బహ్రెయిచ్ హింస కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ హమీద్ కుమారులు. నేపాల్ సరిహద్దుకు సమీపంలోని బహ్రెయిచ్ లోని హండా బసెహ్రీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. నిందితులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, యూపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీ, ఏడీజీ, లా అండ్ ఆర్డర్ సహా సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. ఇకపోతే, ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అధికారులు అరెస్టు చేశారు.

ఊరేగింపులో ఘర్షణ

ఆదివారం దుర్గా విగ్రహం నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో వందలాది మంది నిరసన తెలిపారు. ఊరేగింపులో డీజే ప్లే చేయడంపై హింస చెలరేగింది. ఈ ఘటనలో రాంగోపాల్ మిశ్రా మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డారు. బహ్రెయిచ్ లోని మహసీ సబ్‌ డివిజన్‌ గుండా వెళ్తుండగా ఊరేగింపుపై రాళ్లు రువ్వడం, తుపాకీ కాల్పులు జరగడంతో ఘర్షణలు చెలరేగాయి. అయితే, ఘర్షణ జరిగిన రెండ్రోజుల తర్వాత రాం గోపాల్ మిశ్రా కుటుంబసభ్యులు లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ ని కలిశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Similar News