Canada: బిష్ణోయ్ ముఠాపై చర్యలు తీసుకోవడంలో కెనడా ఫెయిల్.. భారత విదేశాంగ శాఖ

లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులను అరెస్టు చేయాలని కెనడాకు అనేక సార్లు విజ్ఞప్తి చేశామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ తెలిపారు.

Update: 2024-10-17 14:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులను అరెస్టు చేయాలని కెనడాకు అనేక సార్లు విజ్ఞప్తి చేశామని, కానీ తమ అభ్యర్థనను వారు పట్టించుకోలేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. బిష్ణోయ్ గ్యాంగ్‌పై చర్యలు తీసుకోవడంలో కెనడా విఫమైందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘బిష్ణోయ్ గ్యాంగ్‌‌కు సంబంధించిన వారిని అదుపులోకి తీసుకోవాలని ఎన్నోసార్లు కెనడాకు విన్నవించుకున్నాం. కానీ మా ఆందోళనలపై వారు ఇప్పటి వరకూ స్పందించలేదు. దీని వెనుక రాజకీయ ఉద్దేశం కూడా ఉంది’ అని తెలిపారు. ఖలిస్థానీ నేత నిజ్జర్ హత్య కేసులో భారత ప్రతినిధుల హస్తం ఉందని ట్రూడో చేసిన ఆరోపణలపైనా జైస్వాల్ స్పందించారు. వీటికి సంబంధించి కెనడా ఎటువంటి ఆధారాలూ ఇవ్వలేదని, అంతేగాక విచారణ కమిటీ ముందు కూడా ట్రూడో ఇదే విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. ఇంటలిజెన్స్ సమాచారం మాత్రమే ఉందని ట్రూడో అంగీకరించారని తెలిపారు. భారత దౌత్య వేత్తలపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

హిందువులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి: కెనడా ఎంపీ

కెనడాలో పెరుగుతున్న ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆ దేశ ఎంపీ చంద్ర ఆర్య హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ నాయకులు తీవ్రవాదులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు. హిందూ-కెనడియన్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఇవ్వలేదని, ప్రస్తుత పరిణామాలతో వారు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఖలిస్థానీ నిరసనకారుల బృందం తనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించిందని, కాబట్టి తనకు పూర్తి భద్రత కల్పించినప్పుడే తాను హిందూ కార్యక్రమాలలో పాల్గొనగలనని స్పష్టం చేశారు.

మరోవైపు కెనడియన్ జర్నలిస్ట్ డేనియల్ బోర్డ్‌మాన్ సైతం పీఎం ట్రూడో తీరుపై విరుచుకుపడ్డారు. కేవలం ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించడం సరికాదన్నారు. ట్రూడో పనితీరు సరిగా లేదని ఆయన చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని తెలిపారు. తాను ఖలిస్థానీ వేర్పాటువాదానికి వ్యతిరేకమని ఎప్పుడూ చెబుతూనే, దానిని ప్రోత్సహిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో భారతే పైచేయి సాధించిందని తెలిపారు.


Similar News