Aviation Industry: గంటకు రూ. 17 లక్షలు నష్టపోతున్న ఎయిర్‌లైన్స్ కంపెనీలు

అంతర్జాతీయ విమానాలకు దీని కంటే మూడు నుంచి ఐదు రెట్ల నష్టం తప్పటంలేదని విమానయాన రంగ నిపుణులు పేర్కొన్నారు.

Update: 2024-10-17 17:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల వరుసగా బాంబు బెదిరుంపుల కారణంగా దేశీయ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. విమానాల ఆలస్యం, రూట్ మార్పులు వంటి అంతరాయాలతో భారీగా ఆర్థిక నష్టాలను చూశాయి. దీనిపై సమీక్ష నిర్వహించిన పరిశ్రమ వర్గాలు విమానాల రూటు మార్చడం వల్ల ఒక్కో ఘటనకు రూ. 17 లక్షల వరకు సంస్థలు నష్టపోతున్నాయని వెల్లడించాయి. విమానం ప్రయాణించే దూరం, ఇంధనం, ప్రయాణీకుల సంఖ్య, అదనపు లాజిస్టిక్స్, విమానయాన ఛార్జీలు వంటి అంశాలపై ఆధారపడి ఖర్చులు మారుతాయి. కాబట్టి ప్రతి డైవర్షన్‌కు ఎంత మొత్తం అనేది ఖచ్చితమైన ధరను నిర్ణయించలేం. అయితే, సగటున రూ. 13-17 లక్షల వరకు నష్టం కనిపిస్తోంది. అంతర్జాతీయ విమానాలకు దీని కంటే మూడు నుంచి ఐదు రెట్ల నష్టం తప్పటంలేదని విమానయాన రంగ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఖర్చులతో పాటు విమానయాన సంస్థలు షెడ్యూల్‌లో జాప్యం వల్ల ఇతర ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నాయి. తర్వాత ప్రయాణించాల్సిన విమానాల ఆలస్యం, ప్రయాణీకులకు అందించాల్సిన సేవల్లో ఇబ్బందులు తప్పట్లేదని ఎయిర్‌లైన్ అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 16న కనీసం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఎయిర్ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనల కారణంగా భద్రతా లోపాలు కూడా ఎయిర్‌లైన్ కంపెనీలకు తీవ్ర సవాళ్లుగా మారుతున్నాయని నిపుణులు వెల్లడించారు. 

Tags:    

Similar News