చుక్కనీటిని కూడా ఇతర రాష్ట్రాలకు వదులుకోం : హర్యానా సీఎం

పంజాబ్-హర్యానా రాష్ట్రాల మధ్య ‘సట్లేజ్-యమునా లింక్ కెనాల్ (ఎస్ వైఎల్ కే)’ వివాదం మరింత ముదురుతోంది.

Update: 2023-10-16 13:44 GMT

చండీగఢ్ : పంజాబ్-హర్యానా రాష్ట్రాల మధ్య ‘సట్లేజ్-యమునా లింక్ కెనాల్ (ఎస్ వైఎల్ కే)’ వివాదం మరింత ముదురుతోంది. హర్యానాకు చెందిన నదీజలాల్లో చుక్కనీటిని కూడా మరో రాష్ట్రానికి దక్కనిచ్చేది లేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ సోమవారం స్పష్టం చేశారు. అయితే సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల ప్రాతిపదికన కెనాల్ వివాదంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమేనని ఆయన ప్రకటించారు. కెనాల్ నిర్మాణంలో ఎదురయ్యే అవాంతరాలకు ఉమ్మడి పరిష్కారాన్ని కనుగొనే అంశాన్ని పంజాబ్ సీఎం ఎదుట ప్రతిపాదిస్తానన్నారు.

అక్టోబర్ 4న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో పంజాబ్ పరిధిలో కెనాల్ నిర్మాణం ఎంతమేర జరిగిందనే దానిపై సర్వే చేయాలని కేంద్రాన్ని ఆదేశించారే తప్ప.. జలాల కేటాయింపు గురించి ప్రస్తావించలేదని ఖత్తర్ తేల్చి చెప్పారు. పంజాబ్‌లో కెనాల్ నిర్మాణం త్వరగా పూర్తికావాలని హర్యానాలోని ప్రతి పౌరుడు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈమేరకు పంజాబ్ సీఎంకు ఖత్తర్ లేఖ రాశారు. పంజాబ్‌లో ఎస్‌వైఎల్‌ కెనాల్‌ను నిర్మించకపోవడం వల్ల హర్యానాకు న్యాయమైన నీటి వాటా లభించడం లేదని ఖత్తర్ సర్కారు వాదిస్తోంది.


Similar News