S Jaishankar: కేవలం పర్యటన మాత్రమే.. పాక్ తో చర్చలు లేవు

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. కాగా.. దాయాది దేశంలో జరిగే పర్యటన గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-05 10:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. కాగా.. దాయాది దేశంలో జరిగే పర్యటన గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంఘం (SCO) వార్షిక సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అయితే, అందులో భాగంగా పాక్ తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని తేల్చిచెప్పారు. ‘‘ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నా. భారత్‌-పాకిస్థాన్ సంబంధాలు గురించి మాట్లాడేందుకు కాదు. ఎస్‌సీఓలో సభ్యుడిగా ఆ దేశంలో పర్యటిస్తున్నా. దానికి అనుగుణంగానే వ్యవహరిస్తాను’’ అని జై శంకర్ వెల్లడించారు.

సార్క్ గురించి ఏమన్నారంటే?

అలాగే, సౌత్‌ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్‌ రీజినల్ కో-ఆపరేషన్ (SAARC) గురించి జైశంకర్ మాట్లాడారు. ‘‘కొన్ని చిన్న కారణాల వల్ల సార్క్ సమావేశాలు జరగడం లేదు. సార్క్‌లోని ఒక సభ్యదేశం.. ఆ గ్రూపులోని మరో దేశంపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది.’’ అని పాకిస్థాన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆ దేశం చర్యల వల్లే సార్క్ సమావేశాలు ఆగిపోయాయని అన్నారు. కానీ, ప్రాంతీయ కార్యకలాపాలు మాత్రం నిలిచిపోలేదని తెలిపారు. గత ఐదారేళ్లుగా.. భారత ఉపఖండంలో మరింతగా ప్రాంతీయ సమైక్యత పెరిగిందన్నారు. ఈసారి ఎస్‌సీవో సదస్సుకు పాక్ ఆతిథ్యం ఇస్తుంది. కాగా.. పాకిస్థాన్‌ నుంచి ప్రధాని మోడీకి ఆహ్వానం అందినట్లు ఆగస్టు 30న కేంద్రం ఇప్పటికే ధ్రువీకరించింది. గతకొంతకాలంగా కశ్మీర్ సమస్య, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌ తీరుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అలాంటి పాకిస్థాన్‌కు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి భారత విదేశాంగ మంత్రి వెళ్తున్నారు. షాంఘై శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రతినిధి బృందానికి జైశంకర్‌ నాయకత్వం వహించనున్నారు. కేవలం సదస్సు కోసమే ఆయన పాక్ వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Similar News