విద్యా శాఖను మూసేయండి

1980 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే రోనాల్డ్ రీగన్ ఈ విషయంపై హామీ ఇచ్చినట్లు రిపబ్లికన్లు వాదిస్తున్నారు.

Update: 2025-03-21 17:45 GMT
విద్యా శాఖను మూసేయండి
  • whatsapp icon

- దాని వల్ల డబ్బు వృధా

- విద్యాధికారాన్ని రాష్ట్రాలకే ఇచ్చేద్దాం

- కీలక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం

దిశ, నేషనల్ బ్యూరో: విద్యా శాఖను ఫెడరల్ ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని.. ఆ శాఖకు పెట్టే డబ్బంతా వృధానే అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. విద్యా శాఖను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌పై ట్రంప్ గురువారం సంతకం చేశారు. విద్యా శాఖను ఎందుకు ఫెడరల్ ప్రభుత్వం మూసివేస్తుంది? రాష్ట్రాలకు తిరిగి విద్యాధికారాన్ని ఎందుకు ఇస్తుంది? అందుకు ఆయా రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలను వివరిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఆ ఆర్డర్‌ను విద్యా శాఖ కార్యదర్శి లిండా మెక్‌మహెన్‌కు పంపించి.. తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విద్యా శాఖ అసమర్థంగా, ఉదారవాద భావజాలంతో నిండి ఉందని గతంలోనే ట్రంప్ విమర్శించారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం జోక్యం అధికంగా ఉండటం వల్లే విద్యా రంగం పేలవంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ద్వారా ఫెడరల్ ప్రభుత్వ చేతిలో ఉన్న విద్యా శాఖను తొలగించడానికి ఉన్న తొలి అడ్డంకి పక్కకు పోయిందని వైట్ హౌస్ పేర్కొంది.

విద్యా శాఖకు సంబంధించిన ఫ్యాక్ట్ షీట్‌లో ఇంత వరకు ఖర్చు చేసిన మొత్తాన్ని చూపించారు. 1979 నుంచి అమెరికా ఫెడరల్ ప్రభుత్వం విద్యా శాఖపై 3 ట్రిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపింది. అయితే వాస్తవంగా ఎంత ఖర్చు అయ్యిందో మాత్రం ఇందులో లేదని అన్నారు. ఆ కాలంలో ప్రతీ విద్యార్థికి అయ్యే ఖర్చు కంటే 245 శాతం ఎక్కువగా ఫెడరల్ ప్రభుత్వం ఖర్చు చేసినా.. విద్యార్థుల అభ్యాసనలో మెరుగుదల కనపడలేదని ఫ్యాక్ట్ షీట్‌లో పేర్కొన్నారు. తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా విద్యా శాఖ అనేక రాష్ట్రాల్లోకీలక పాత్ర పోషిస్తోంది. అయితే వైట్ హౌస్ మాత్రం ఇప్పుడు ఆ ఆర్థిక సాయాన్ని వృధాగా పరిగణిస్తోంది. సాధారణ పరీక్షల్లో విద్యార్థులు సాధించే స్కోర్లు, అక్షరాస్యతా రేటు, గణితంలో నైపుణ్యం వంటి విషయాల్లో వెనుకబడి ఉండటం వల్లే ట్రిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినా.. అది వృధాగా ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.

కాగా విద్యా శాఖను మూసివేయాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ పరిపాలనలో విద్యా శాఖను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం భవిష్యత్‌లో తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే 1980 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే రోనాల్డ్ రీగన్ ఈ విషయంపై హామీ ఇచ్చినట్లు రిపబ్లికన్లు వాదిస్తున్నారు.

Tags:    

Similar News