'దీదీ వెళ్లకపోయినా ఆకాశమేమీ ఊడిపడేది కాదు'

జీ -20 విందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరుకావడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్ రంజన్‌ చౌధరి అభ్యంతరం వ్యక్తం చేశారు.

Update: 2023-09-11 11:49 GMT

న్యూఢిల్లీ : జీ -20 విందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరుకావడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్ రంజన్‌ చౌధరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రపతి ఇచ్చిన జీ-20 విందుకు దీదీ వెళ్లకపోయినా.. ఆకాశమేమీ ఊడిపడేది కాదుగా’’ అని కామెంట్స్ చేశారు. ఈ విందులో మమత కూడా పాల్గొనడంతో తాను సంభ్రమాశ్చర్యాలకు గురైనట్లు ఆయన తెలిపారు. జీ20 డిన్నర్‌ టేబుల్ వరుసలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పక్కన మమతా బెనర్జీ కుర్చీ ఉండటంపై విమర్శలు గుప్పించారు.

కొందరు విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు ఈ విందులో పాల్గొనడం మానుకున్నారని, మమతా బెనర్జీ మాత్రం అందరి కంటే ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారని అధిర్ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు టీఎంసీ రాజ్యసభ ఎంపీ శంతను సేన్‌ కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ సీఎం ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలనేది అధిర్ నిర్ణయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇండియా కూటమిలో ఉన్న విషయం మమతా బెనర్జీకి తెలుసు. ఆమె నిబద్ధతను ఎవరూ ప్రశ్నించాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్‌ను ఆమె అనుసరించారు. దాని గురించి మమతకు ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని అధిర్ వ్యాఖ్యలను శంతను తిప్పికొట్టారు.


Similar News