రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయాలను అడ్డుకోలేం : సుప్రీం

రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే విధానపరమైన నిర్ణయాన్ని అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Update: 2023-10-06 13:13 GMT

న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే విధానపరమైన నిర్ణయాన్ని అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీహార్ ప్రభుత్వం రూపొందించిన కులగణన నివేదికలోని వివరాలను వెల్లడించకుండా నిరోధించడానికి నిరాకరించింది. బీహార్‌లో నిర్వహించిన కులగణన రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ.. యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ, ఏక్‌ సోచ్‌ ఏక్‌ ప్రయాస్‌ అనే స్వచ్ఛంద సంస్థలు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సర్వే వివరాలను వెల్లడించిందని ఓ పిటిషనర్‌ తరఫు న్యాయవాది అపరాజితా సింగ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని.. దీనిపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పిన సుప్రీం.. ఒకవేళ సర్వేలోని డేటాకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిశీలనలోకి తీసుకుంటామని చెప్పింది. ఇటువంటి సర్వే చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, తదితర అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. కులగణన నివేదికను ఎందుకు ప్రచురించారో చెప్పాలంటూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్లపై విచారణను 2024 జనవరికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.


Similar News