మావోలపై ఉక్కుపాదం.. చివరి దశలో ఏరివేతలు: అమిత్ షా

Update: 2024-10-07 19:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ట్యాబ్లెట్ల స్ట్రిప్‌లు, కాలిపోయిన గొడుగులు, చెల్లాచెదురుగా పడిన వంట పాత్రలు, బ్యాగ్‌లు, ఖాళీ కార్ట్‌రిడ్జ్‌లు.. ఎన్‌కౌంటర్ తర్వాత అబూజ్‌మడ్ నక్సల్ క్యాంప్‌లో కనిపించిన దృశ్యాలు. శుక్రవారం జరిగిన భీకర కాల్పుల్లో సీపీఐ (మావోయిస్టు) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌కౌంటర్‌లో 18 మంది పురుషులు, 13 మంది మహిళా మావోలు మరణించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్‌కౌంటర్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన ఛత్తీస్‌గఢ్‌పై ప్రశంసలు కురిపించారు. నక్సలిజం అంతానికి ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని, ఆ వ్యూహం గురించి సమావేశంలో వివరించారు. ఇప్పటికే పోరాటం తుది దశకు చేరుకుందని, 2026 మార్చి కల్లా.. అంటే మరో 17 నెలల్లో సంపూర్ణంగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. ఇకపై అఫెన్సివ్ మోడ్‌లో ఆపరేషన్లు చేపట్టాలని సూచించారు. మానవ హక్కులను అత్యధికంగా ఉల్లంఘించేది మావోయిస్టులేనని పేర్కొన్నారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్‌లతో సమావేశం నిర్వహించగా.. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు హాజరయ్యారు. మిగిలిన రాష్ట్రాల సీఎంలు సీనియర్ మంత్రులు, అధికారులను తమకు ప్రతినిధులుగా పంపించారు.

ఎన్ఐఏ సమన్వయంతో..

నేడు భద్రతా బలగాలు డిఫెన్సివ్ కాదు, అఫెన్సివ్ ఆపరేషన్లు చేపడుతున్నాయని కేంద్రం మంత్రి అమిత్ షా తెలిపారు. మావోయిస్టులకు ఆర్థిక సహాయాన్ని అందించే మార్గాలను నొక్కేసే బాధ్యతను ఎన్ఐఏకు అప్పగించి ఈ అఫెన్సివ్ స్ట్రాటజీని అమలు చేస్తున్నామన్నారు. అది మావోలకు ఆయుధాల కొరతవైపు దారితీస్తుందని, అందుకే ఇప్పుడు భద్రతా బలగాలు మావోయిస్టులను అన్ని వైపుల నుంచి కట్టుదిట్టం చేస్తున్నారని వివరించారు. వాళ్లు పారిపోయే చాన్స్ లేకుండా సుదీర్ఘ ఆపరేషన్లతో వారిని అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్నారని పేర్కొన్నారు.

మారుమూల ప్రాంతాలకూ పాలన:

నక్సలైట్లతో పోరాటానికి ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నదని కేంద్రమంత్రి తెలిపారు. మావోల హింస ఉండే ప్రాంతాల్లో రూల్ ఆఫ్ లా ఉండేలా చూసుకోవాలని, మావోయిస్టుల ఉద్యమం కారణంగా జరిగిన నష్టాన్ని వెంటనే పూడ్చి వేగంగా అభివృద్ధి చేపట్టాలని వివరించారు. ఒకవైపు మావోయిస్టులపై ఏమాత్రం ఉదాసీనత లేకుండా పోరాడుతూనే ఆ ఏరియాల్లో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, మావో ప్రభావిత ప్రాంతాలను సంపూర్ణంగా అభివృద్ధిపరచాలని కేంద్రం భావిస్తున్నదని తెలిపారు. నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించడానికి చివరగా అన్ని రాష్ట్రాలు కలిసి పాటుపడాలని సూచించారు. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతి నెలకు ఒకసారి అభివృద్ధి, నక్సల్ నిర్మూలన ఆపరేషన్లను సమీక్షించుకోవాలని, అలాగే.. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ రాష్ట్రాల డీజీపీలు కూడా రివ్యూ నిర్వహించాలని వివరించారు. నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో డీజీపీలు ఒక్కసారైనా రాత్రిపూట గడిపి నేరుగా అక్కడి పరిస్థితులను తెలుసుకుని అంచనా వేసుకోవాలని తెలిపారు. నక్సలిజం అంతానికి ప్రభావిత రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలని, మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఒకరాష్ట్రానికి మరొకటి సమాచారం ఇచ్చుకుంటూ సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు మంచి ట్రాక్ రికార్డు ఉన్నదని చెప్పారు.

జనజీవన స్రవంతిలో కలవండి:

ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ నుంచి 13 వేల మందికిపైగా ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిశారని అమిత్ షా వివరించారు. మావోయిస్టు ఉద్యమం నుంచి బయటికి వచ్చారని తెలిపారు. ఇటువైపు కూడా ఇంకా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న యువత ఆయుధాలు వీడాలని పిలుపు ఇచ్చారు. వారంతా ప్రధాన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. అలా జనజీవన స్రవంతిలో కలిసే వారికి అన్ని రాష్ట్రాలు మంచి పునరావాస పథకాలను అందిస్తున్నదని, వారికి ఎలాంటి సమస్యలు రాకుండా స్కీమ్స్ అందిస్తున్నాయని వివరించారు.

నక్సలిజం తగ్గింది:

గత కొన్ని సంవత్సరాలుగా నక్సలిజం తగ్గుతున్నదని, 53 శాతం వారి హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని కేంద్రమంత్రి వివరించారు. గత తొమ్మిది నెలల్లో 194 మంది మావోయిస్టులు మరణించారని, 800కు పైగా నక్సలైట్లు అరెస్టయ్యారని, 738 మంది సరెండర్ అయ్యారని తెలిపారు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 96 నుంచి 42కు తగ్గిపోయాయని వివరించారు. అందులో 21 జిల్లాలు కొత్తగా విభజించినవని, కాబట్టి, నక్సల్ హింస ఎక్కువగా ఉన్న జిల్లాలు 16 మాత్రమేనని తెలిపారు. నక్సల్ హింసలో బాధితుల సంఖ్య 100కు తగ్గడం గత మూడు దశాబ్దాల్లో 2022లో తొలిగా నమోదైందని, ఆ తర్వాత ఈ సంఖ్య మరింత తగ్గుతూ వస్తున్నదని చెప్పారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా 45 పోలీసు స్టేషన్లు, 194 క్యాంపులు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ఆపరేషన్ల కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని, జవాన్లను ప్రమాదస్థలాల నుంచి కాపాడటానికి గతంలో రెండే హెలికాప్టర్లు ఉండేవని, నేడు అవి 12కు పెంచామని తెలిపారు. మావోల ప్రభావం తగ్గడం వల్లే గత లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 70కు పెరిగిందని, గతంలో ఈ ఏరియాల్లో పోలింగ్ స్టేషన్లే ఉండేవి కావని చెప్పారు.

1000 మంది సైనికులతో ఆపరేషన్:

నారాయణ్‌పూర్ జిల్లాలో విజయవంతంగా 31 మంది మావోయిస్టులను అంతమొందించడాన్ని ప్రస్తావిస్తూ ఛత్తీస్‌గఢ్‌ను కేంద్రమంత్రి అమిత్ షా ప్రశంసించారు. మంచి సమన్వయం, ఇంటెలిజెన్స్‌తో డీఆర్జీ, రాష్ట్ర పోలీసులు, బస్తర్ బెటాలియన్ సిబ్బంది కలిసి అద్భుతంగా ఆపరేషన్ పూర్తి చేశారన్నారు. నక్సలిజం అంతానికి ఈ ఆపరేషన్‌ను అన్ని రాష్ట్రాలు నిదర్శనంగా తీసుకోవాలని వివరించారు. మొన్నటి ఎన్‌కౌంటర్ గురించి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి ప్రెజెంటేషన్ ఇచ్చి అమిత్ షాకు వివరించారు. కొన్ని నెలల క్రితమే ఈ ప్లాన్ వేయగా.. తాజాగా ఆపరేషన్ పూర్తయిందని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో 1000 మంది సైనికులు పాల్గొన్నారని, 15 కిలోమీటర్ల రేడియస్‌తో నక్సలైట్లను చుట్టుముట్టి 31 మందిని చంపేశారని వివరించారు.

Tags:    

Similar News