T 90 Bhishma : టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులకు కొత్త లుక్

దిశ, నేషనల్ బ్యూరో : ‘టీ-90 భీష్మ’ యుద్ధ ట్యాంకుల ఆధునీకరణ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది.

Update: 2024-10-07 19:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘టీ-90 భీష్మ’ యుద్ధ ట్యాంకుల ఆధునీకరణ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. అత్యాధునిక ఫీచర్లు, సరికొత్త రూపు రేఖలతో వాటిని తీర్చిదిద్దారు. అత్యాధునిక వసతులతో ఆధునీకరించిన మొదటి టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకును భారత ఆర్మీ సోమవారం ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. నట్లు, బోల్టుల నుంచి ఇంజిన్ దాకా ప్రతీ భాగాన్ని సమూలంగా మార్చేసి ఈ ఆధునిక లుక్‌లోకి తెచ్చామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి టీ-90 యుద్ధ ట్యాంకులను తొలుత రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. అనంతర కాలంలో వాటిని స్వదేశంలోనే తయారు చేసేందుకు రష్యా నుంచి భారత్ లైసెన్సు తీసుకుంది. చెన్నై సమీపంలోని ఆవడి వద్దనున్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో టీ-90 యుద్ధ ట్యాంకులు తయారు చేస్తుంటారు. ఇప్పుడు కొత్త లుక్‌లోని టీ-90లను కూడా అక్కడే తయారు చేస్తున్నారు.

రెడీ అవుతున్న జోరావర్..

తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జోరావర్’‌‌ను డీఆర్డీఓ పరీక్షించడం వచ్చే సంవత్సరం జనవరి కల్లా పూర్తవుతుంది. అనంతరం దాన్ని ఫీల్డ్ లెవల్ టెస్టింగ్ కోసం ఆర్మీకి అప్పగిస్తారు. ఆర్మీ దాన్ని పరీక్షించి డీఆర్డీఓకు నివేదికను అందిస్తుంది. దాని ఆధారంగా మార్పులు, చేర్పులు చేసి 2027 సంవత్సరంకల్లా భారత ఆర్మీకి జోరావర్‌ను డీఆర్డీఓ అందించనుంది. 


Similar News