ఢిల్లీకి నీళ్లను విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: మంత్రి అతిషి

ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం మంత్రి అతిషి వజీరాబాద్ యమునా రిజర్వాయర్‌ను పరిశీలించారు

Update: 2024-05-30 10:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం మంత్రి అతిషి వజీరాబాద్ యమునా రిజర్వాయర్‌ను పరిశీలించారు. యమునా నది మట్టం 674 అడుగులు కాగా, కానీ అది 670.3 అడుగులకు పడిపోవడంతో నగరానికి సరిపడినంత నీటి సరఫరా జరగడం లేదని ఆమె అన్నారు. నీటి కొరతపై ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి, ఢిల్లీ ప్రస్తుతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుంది. ఇప్పటికే నగరంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. యమునా నదిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను విడుదల చేయకపోవడం వలన నీటి సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాస్తామని, ఢిల్లీ నీటి వాటాను పొందేలా చూడటం కూడా వారి బాధ్యత, నీటిని ఆపే హక్కు హర్యానాకు లేదని ఆమె అన్నారు.

అలాగే, ఢిల్లీ నీటి వాటాను విడుదల చేయకపోవడం పై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆమె తెలిపారు. సమస్యను పరిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, ఢిల్లీ జల్ బోర్డ్‌లో సెంట్రల్ వాటర్ ట్యాంకర్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నాం, దీనిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి పర్యవేక్షిస్తారని, ప్రజలు నీటి ట్యాంకర్ కావాలంటే 1916 కి కాల్ చేయాలని మంత్రి చెప్పారు. ఇంకా బోర్‌వెల్‌లకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు నీళ్లను వృధా చేయవద్దని ఆమె కోరారు.


Similar News