Tata-Airbus: ఎయిర్‌క్రాఫ్ట్‌లనూ ఎగుమతి చేస్తాం: టాటా-ఎయిర్‌బస్ ప్లాంట్ ప్రారంభించిన ప్రధాని మోడీ
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో టాటా-ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్ అసెంబ్లీ ఫెసిలిటీ కాంప్లెక్స్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌లు సోమవారం ప్రారంభించారు.
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ రాష్ట్రంలోని వడోదర(Vadodara)లో టాటా-ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్(Tata Airbus Aircraft) అసెంబ్లీ ఫెసిలిటీ కాంప్లెక్స్‌ను ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi), స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌లు సోమవారం ప్రారంభించారు. స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ సంస్థ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో కలిసి సంయుక్తంగా సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇక్కడ తయారు చేయనుంది. ఇది వరకే స్పెయిన్ నుంచి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు భారత్‌కు వస్తున్నాయి. టాటాకు చెందిన సుమారు 200 మంది సిబ్బంది ఇందుకు స్పెయిన్‌లో శిక్షణ పొందుతున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రతన్ టాటా జీవించి ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొని ఉండేవారని, ఆయన ఎక్కడున్నా.. ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషపడతారని వివరించారు. ‘నేను సీఎంగా ఉన్నప్పుడు వడోదరలో ట్రైన్ కోచ్‌లు నిర్మించాలనే నిర్ణయం జరిగింది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు మెట్రో కోచ్‌లను ఎగుమతి చేస్తున్నాం. భవిష్యత్‌లో ఇలాగే మనం తయారు చేసిన ఎయిర్‌క్రాఫ్ట్‌లను విదేశాలకు ఎగుమతి చేస్తామనే నమ్మకం ఉన్నది’ అని వివరించారు. టాటా, ఎయిర్‌బస్‌ల ప్రాజెక్టు మరిన్ని యూరప్ కంపెనీలు భారత్‌కు రావడానికి ద్వారాలు తెరుస్తుందని భావిస్తున్నట్టు స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ అన్నారు. ప్రధాని మోడీ విజన్‌తో భారత్ అభివృద్ధి మార్గంలో కొత్త పుంతలు తొక్కుతున్నదని వివరించారు. రెండేళ్లలో తొలి విమానాన్ని డెలివరీ చేస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే టాటా గ్రూప్‌నకు చెందిన 200 మంది ఇంజినీర్లు స్పెయిన్‌లో శిక్షణ పొందుతున్నారని వివరించారు.