మమ్మల్ని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఎస్ఎస్ ను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్ఎస్ఎస్ ను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హజరైన ఆయన వేదికపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనివార్యమైన ప్రక్రియ. అందులో రెండు పక్షాలు ఉన్నందున పోటీ ఉందని అన్నారు. ఇది పోటీలో ఎవరికి వారు తమను తాము ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తారని, దానిలో నిజాయితీ ఉండాలి కానీ అబద్ధాలు మాట్లాడకూడదని తెలిపారు. దేశాన్ని పాలించడానికి ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్ కు పంపిస్తారని, దానిలో భాగంగానే ఎన్నికలు జరగాలి కానీ యుద్దంలా జరగకూడదని చెప్పారు. ప్రచారంలో ఇలాంటి విమర్శలు చేయడం వల్ల సమాజంలో చిచ్చుకు దారి తీస్తుందని, చీలికలు వస్తాయని అన్నారు.
ఇందులోకి ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థలు కూడా అనవసరంగా లాగారని, టెక్నాలజీ సాయంతో అసత్యాన్ని ప్రదర్శించారని, ఆధునిక సాంకేతికత ను ఉపయోగించి అబద్ధాన్ని ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షం అనేది కూడా ఉండాలి. ఒకవైపు వారి అభిప్రాయాలు కూడా వెలుగులోకి రావాలి. పోటీ చేయడంలో గౌరవం ఉండాలి కానీ ఈ ఎన్నికల్లో ఆ గౌరవం కనిపించలేదని అన్నారు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు అంతం కాలేదు కాబట్టే ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అలాగే గత 10 ఏళ్లలో చాలా సానుకూల విషయాలు జరిగాయని, అయితే ఇప్పుడు మనం సవాళ్ల నుండి పూర్తిగా విముక్తి పొందామని అనుకోవద్దని మోహన్ భగవత్ అన్నారు.