అంతరిక్షంలో యుద్ధం జరిగే అవకాశం.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు

Update: 2023-04-11 17:00 GMT

న్యూఢిల్లీ: అంతరిక్షంలో యుద్ధం జరిగే అవకాశముందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతరిక్షంలో సైనికీకరణపై తీవ్రమైన పోటీ నెలకొందని ఆయన చెప్పారు. స్పేస్ డొమైన్‌లో అత్యాధునిక సాంకేతికతను చేర్చాలని... ప్రత్యేక దృష్టితో ద్వంద్వ వినియోగ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐఎస్‌పీఏ) నిర్వహించిన మూడ్రోజుల ఇండియన్ డెఫ్‌స్పెస్ సింపోజియంను జనరల్ చౌహాన్ మంగళవారం ప్రారంభించారు.

‘అంతరిక్షం అనేది భూమి, సముద్రం, గాలి, సమాచారం (సైబర్) వంటి ఇతర ప్రదేశాల సామర్థ్యాలను పెంపొందించే ప్రాంతం. అంతరిక్షం నుంచి మనల్ని మనం విడదీయలేం’ అని ఆయన అన్నారు. చైనా, రష్యా నిర్వహించిన యాంటీ - శాటిలైట్ పరీక్షలపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ధ్వజమెత్తారు. అంతరిక్ష రంగంలో భారత్ అఫెన్సివ్, డిఫెన్సివ్ సామర్థ్యాలపై ఆయన నొక్కి చెప్పారు. ‘భారత దేశానికి సంబంధించినంత వరకు మనము స్పేస్ డొమైన్‌లో అంతరిక్ష సపోర్ట్ నుంచి అంతరిక్ష విస్తరణకు ఎదగాలి.

అత్యాధునిక సాంకేతికతతో ద్వంద్వ వినియోగ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మనమందరం కృషి చేయాలి’ అని జనరల్ చౌహాన్ చెప్పారు. భారతదేశం ఎన్ఏవిఐసీ కూటమిని విస్తరించాలి, చురుకైన అంతరిక్ష ఆధారిత మేధస్సును అందిచాలని అన్నారు. నిఘా, గూఢాచర్యం (ఐఎస్ఆర్)తో పాటు సురక్షితమైన ఉప గ్రహ సమాచారాలను నిర్ధారించుకోవాలని ఆయన చెప్పారు.

Tags:    

Similar News