Calcutta : తొమ్మిదేళ్ల జైలుశిక్ష అనుభవించాక.. హత్య కేసులో నిర్దోషిగా తీర్పు

దిశ, నేషనల్ బ్యూరో : అన్నను చంపాడనే అభియోగాలతో రణదీప్ బెనర్జీ అనే వ్యక్తికి దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను కలకత్తా హైకోర్టు(Calcutta High Court) రద్దు చేసింది.

Update: 2024-11-02 16:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అన్నను చంపాడనే అభియోగాలతో రణదీప్ బెనర్జీ అనే వ్యక్తికి దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను కలకత్తా హైకోర్టు(Calcutta High Court) రద్దు చేసింది. దీంతో తొమ్మిదేళ్ల జైలుశిక్ష అనుభవించిన తర్వాత అతడికి కటకటాల నుంచి విముక్తి లభించింది. వివరాల్లోకి వెళితే.. సుదీప్ బెనర్జీ, రణదీప్ బెనర్జీ సోదరులు. సుదీప్ బెనర్జీకి పెళ్లి జరిగింది. అయితే అతడు 2009 సంవత్సరం నుంచి భార్య, కుమారుడికి దూరంగా ఉంటున్నాడు. అప్పటి నుంచి కోల్‌కతా(Calcutta) నగరంలో తన సోదరుడు రణదీప్‌తో కలిసి సుదీప్ ఉండేవాడు. 2015 ఏప్రిల్ నెలాఖరులో సుదీప్ బెనర్జీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.

సుదీప్‌ను హత్య చేసింది రణదీపే అంటూ 2015 ఏప్రిల్ 24న వారి సమీప బంధువు జయదీప్ బెనర్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీన్ని విచారించిన అడిషనల్ సెషన్స్ కోర్టు.. రణదీప్ బెనర్జీకి జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. దీనిపై రణదీప్ కలకత్తా హైకోర్టులో అప్పీల్ చేయగా.. తొమ్మిదేళ్ల శిక్షను అనుభవించిన తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు నిర్దోషిగా తీర్పు వెలువడింది. రణదీప్ ఈ హత్య చేసినట్టుగా ఆధారాలేవీ లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Tags:    

Similar News