Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి.. కేరళ అసెంబ్లీలో తీర్మానం

వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది

Update: 2024-10-14 15:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. మంత్రి వీ అబ్దురహిమాన్ ఈ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలో పొందుపరచబడిన సమాఖ్య సూత్రాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా అబ్దురహిమాన్ మాట్లాడుతూ..వక్ఫ్ సవరణ బిల్లు వక్ఫ్ విషయాలకు సంబంధించి రాష్ట్ర హక్కులను ఉల్లంఘిస్తుందని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను పర్యవేక్షించే బాధ్యత కలిగిన బోర్డులు, ట్రిబ్యునల్‌ల అధికారాన్ని బలహీనపరుస్తుందని ఆరోపించారు.

అంతేగాక రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలను ఉల్లంఘిస్తుందని, అలాగే ఎన్నికైన ప్రతినిధుల స్థానంలో నామినేటెడ్ సభ్యులను నియమించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు. రాజ్యాంగ పునాదికే విరుద్ధమైన నిబంధనలు బిల్లులో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మద్దతిచ్చింది. కాగా, 1995 వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా మసీదుల నిర్వహణలో పారదర్శకతను తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటుండగా.. ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. 


Similar News