భారతదేశాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకే ఓటు వేశా: జేపీ నడ్డా

శనివారం హిమాచల్ ప్రదేశ్‌ బిలాస్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, భారత్‌ను మరింత పటిష్టంగా, స్వావలంబనగా మార్చేందుకే తాను ఓటు వేశానని అన్నారు

Update: 2024-06-01 08:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శనివారం హిమాచల్ ప్రదేశ్‌ బిలాస్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, భారత్‌ను మరింత పటిష్టంగా, స్వావలంబనగా మార్చేందుకే తాను ఓటు వేశానని అన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశ భవిష్యత్తు గురించి ప్రజలు ఆశాజనకంగా ఉన్నారు. పదేళ్ల క్రితం ప్రజలు రాజకీయాలను వదులుకున్నారు, ఇప్పుడు ఆ ప్రజలు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారని ఆయన అన్నారు.

కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు భారతదేశాన్ని 10 సంవత్సరాల క్రితం నాటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నట్లు తెలుసుకున్నారు. బీజేపీ అధాకారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తుంది. ఇందిరా గాంధీ హయాంలో 1976లో కాంగ్రెస్ రాజ్యాంగ పీఠికను మార్చి తమపై ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ 75 ఏళ్లుగా తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి విభజించు పాలించు అనే సిద్ధాంతం తో పని చేస్తుందని జేపీ నడ్డా పేర్కొన్నారు.

ఎన్డీయే కూటమి 400 సీట్ల మార్కును దాటుతుందని నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ తన సానుకూల రాజకీయాలతో భారత్‌ను విక్షిత్‌ భారత్‌ వైపు తీసుకెళ్లేలా పనిచేస్తున్నారు. దేశంలో మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం నడుస్తుంది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడం వంటి హమీలను విజయవంతంగా నేరవేర్చాము. ఈ రెండింటి ద్వారా మేము ఓట్లు పొందాలని చూడటం లేదు. ఆర్టికల్ 370 అనేది దేశానికి సంబంధించిన అంశం, రామమందిరం ద్వారా భారతదేశ గర్వాన్ని కాపాడమని, ఇవి ఓట్ల కోసం చేసిన పనులు కాదని బీజేపీ చీఫ్ అన్నారు.


Similar News