J&K polling: కొనసాగుతున్న పోలింగ్.. ఓటేయాలని పిలుపునిచ్చిన ప్రముఖ్యులు

జమ్ముకశ్మీర్ లో తొలివిడత పోలింగ్ కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.

Update: 2024-09-18 03:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ లో తొలివిడత పోలింగ్ కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. పెద్దసంఖ్యలు ప్రజలు ఓటువేయాలని ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోడీ జమ్ముకశ్మీర్ ఓటర్లను కోరారు. "జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కనసాగుతోంది. పెద్దసంఖ్యలో ఓటు వేయాలని, ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని కోరుకుతున్నా. ప్రత్యేకించి యువత, తొలిసారి ఓటు వేసేవారు తప్పక ఓటు హక్కుని వినియోగించుకోవాలి” అని మోడీ సోషల్ మీడియా ఎక్స్ లో చెప్పుకొచ్చారు. ఉక్కు సంకల్పం ఉన్న ప్రభుత్వం మాత్రమే జమ్ముకశ్మీర్‌ను ఉగ్రవాద రహితంగా మార్చగలదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. “ దృఢసంకల్పం ఉన్న ప్రభుత్వం మాత్రమే ఉగ్రవాద రహిత జమ్ముకశ్మీర్‌ను సృష్టించగలదు. అక్కడి పౌరుల హక్కులను పరిరక్షించగలదు. అభివృద్ధి పనులను వేగవంతం చేయగలదు. యువతకు విద్య, ఉపాధి.. మహిళా సాధికారత, వేర్పాటువాదం, ఆశ్రిత పక్షపాతానికి ముగింపు పలికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఓటు వేయడం ముఖ్యం’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

కొనసాగుతున్న పోలింగ్

జమ్ముకశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. తొలి దశలో 24 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 23 లక్షల మంది ఓటర్లు తొలివిడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్త మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడతలో కీలకమైన పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పుర, జైనాపుర, శోపియాన్, డీహెచ్‌ పుర, కుల్గాం, దేవ్‌సర్, దూరు, కోకెర్‌నాగ్, అనంత్‌నాగ్‌ వెస్ట్, అనంత్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా నియోజకవర్గాలున్నాయి. బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (NC), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (PDP) ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఎన్‌సీతో కాంగ్రెస్‌ జట్టు కట్టింది.


Similar News