Viral: అవినీతిపై చర్యలు తీసుకునేందుకు వినూత్న నిరసన.. పాములా పాకుతూ కలెక్టర్ ఆఫీస్‌కి

అవినీతి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Update: 2024-09-03 12:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అవినీతి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. తాను అధికారులకు సమర్పించిన అర్జీలను తోకల చేసి పాములా పాకుతూ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీముచ్ జిల్లా కంకారియా తలై గ్రామపంచాయితీలో నిర్మాణం, అభివృద్ది పనుల పేరుతో అప్పటి సర్పంచ్, ఆమె భర్త భారీగా అవినీతి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ముఖేశ్ ప్రజాపతి అనే వ్యక్తి గత ఏడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.

వీరితో పాటు జిల్లా పంచాయితీ సీఈఓ గురు ప్రసాద్ కూడా 1.25 కోట్ల అవినీతి చేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, దీనిపై ఇప్పటికే లోకాయుక్తాతో పాటు సీఎం సహా అందరూ అధికారాలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నీముచ్ జిల్లాకు కొత్త కలెక్టర్ వచ్చారని తెలుసుకొని, ఇప్పటివరకు ఇచ్చిన ఫిర్యాదులను పాము తోకగా తయారు చేసి, కొండచిలువలా పాకుతూ వచ్చి మరోసారి ఫిర్యాదు చేశాడు. దీంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై ముఖేశ్ మాట్లాడుతూ సకాలంలో చర్యలు తీసుకోకుంటే అవినీతి కొండచిలువలా.. ఈ వ్యవస్థను మింగేస్తుందని, ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకే ఇలా చేశానని చెప్పాడు. తన ఫిర్యాదుపై స్పందించి ఈడీ విచారణకు ఆదేశించాలని ముఖేశ్ కలెక్టర్ ను కోరాడు. ఇక కొండచిలువలా పాకుతూ కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే సరికి అతడి బట్టలు చిరిగి శరీరంపై స్వల్ప గాయాలయ్యాయి. ముఖేశ్ ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ దీనిపై మరోసారి విచారణకు ఆదేశించాడు.


Similar News