PM Modi : ఆ విషయంలో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల హామీల విషయంలో కాంగ్రెస్(Congress) నిజ స్వరూపం బయటపడిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల హామీల విషయంలో కాంగ్రెస్(Congress) నిజ స్వరూపం బయటపడిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) విమర్శించారు. ‘‘ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాని హామీలను ఎన్నికల్లో ఇవ్వొద్దు’’ అంటూ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లకు మల్లికార్జున ఖర్గే(Kharge) ఇచ్చిన సూచనలను ఉద్దేశించి ప్రధాని ఈ కామెంట్ చేశారు. అవాస్తవ వాగ్దానాలను అమలుచేయడం అసాధ్యమనే వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే గ్రహిస్తోందని మోడీ ఎద్దేవా చేశారు. అమలుకు సాధ్యం కాని హామీల వల్ల ప్రజలకు ప్రయోజనమేం ఉండదన్నారు.
ఇప్పుడు యావత్ దేశ ప్రజల ఎదుట కాంగ్రెస్ పార్టీ హామీల బండారం బయటపడిందని ప్రధాని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ఒక పోస్ట్ చేశారు. ‘‘దేశంలో కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రాన్నైనా మీరు చెక్ చేయండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు దారుణంగా దెబ్బతిన్నాయి’’ అని ఆయన చెప్పారు. బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోందన్నారు. ఆ పార్టీ రాజకీయ నాటకాలకు పేదలు, యువత, రైతులు, మహిళలు బలి అవుతున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చే స్కీంలను అమలు చేయకపోగా.. పాత స్కీంల లబ్ధిదారుల ప్రయోజనాలకు కాంగ్రెస్ గండికొడుతోందన్నారు.