ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు వెళ్లనున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ బుధవారం ఇరాన్‌కు వెళ్లనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొసేన్ అమీ-అబ్దోల్లాహియాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మృతికి సంతాపం తెలిపేందుకు అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ బుధవారం ఇరాన్‌కు వెళ్లనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇబ్రహీం రైసీ గౌరవ సూచకంగా మంగళవారం భారత్ అంతటా ఒకరోజు సంతాప దినాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రైసీ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి భారత్ తరపున సంతాపం తెలియజేశారు. ఆదివారం తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లాహియన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్సు గవర్నర్ మలేక్ రహ్‌మతీ, మరో ఐదుగురు అధికారులు మృతి చెందినట్లు అధికారిక వార్తాసంస్థ ఐఆర్‌ఎన్‌ఏ ప్రకటించింది.