AFSPA: అఫ్సా చట్టాన్ని రద్దు చేయాలి.. మణిపూర్‌లో మహిళల భారీ ర్యాలీ
అప్సా చట్టాన్నిఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మణిపూర్‌లోని ఇంఫాల్ జిల్లాలో వేలాది మంది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు.
దిశ, నేషనల్ బ్యూరో: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)ని రాష్ట్రం నుంచి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మణిపూర్‌లోని ఇంఫాల్ జిల్లా(Imphal distric)లో వేలాది మంది మహిళలు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కర్ఫ్యూ ఆదేశాలను దిక్కరిస్తూ మహిళలు నిరసన తెలిపారు. జిల్లాలో స్థానిక క్లబ్‌లు, మీరా పైబిస్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించగా అఫ్సాను రాష్ట్రంలో రద్దు చేయాలని, మహిళలు, పిల్లల హత్యలను ఆపాలని నినాదాలు చేశారు. సీఎం సచివాలయానికి 3కిలోమీటర్ల దూరంలో భద్రతా బలగాలు ర్యాలీని అడ్డుకున్నాయి. అనంతరం ప్రదర్శనకారులు కొంగ్బా ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించారు.
అఫ్సా విధింపు వల్ల గతంలో జరిగిన క్రూరత్వాలు ఇంకా మర్చిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్ కేసులు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. కాబట్టి వెంటనే అప్ఫాను రద్దు చేయాలని నొక్కి చెప్పారు. కాగా, జాతి ఘర్షణల వల్ల దెబ్బతిన్న జిరిబామ్‌తో సహా మణిపూర్‌లోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేంద్రం ఇటీవల అఫ్సా చట్టాన్ని అమలు చేసింది. హింస కారణంగా అక్కడ కొనసాగుతున్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే దీనిని రాష్ట్రమంతా విస్తరించాలని కుకీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మహిళలు అఫ్సాకు వ్యతిరేకంగా నిరసన తెలపడం గమనార్హం.