2024లో యూపీఏ-3 అధికారంలోకి రావడం సాధ్యమే : కపిల్ సిబల్

ప్రతిపక్షాలు ఒకే లక్ష్యం, ఒకే ఎజెండాతో ముందుకుపోతే 2024లో యూపీఏ-3 అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు.

Update: 2023-06-18 11:40 GMT

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ఒకే లక్ష్యం, ఒకే ఎజెండాతో ముందుకుపోతే 2024లో యూపీఏ-3 అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఎదుర్కోవాలంటే కొన్ని సీట్లలో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో విపక్షాలు వ్యవహరించాలని పేర్కొన్నారు. "కామన్ మినిమం ప్రోగ్రాం" బదులు "న్యూ విజన్ ఫర్ ఇండియా"తో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. ఆదివారం న్యూయార్క్ నుంచి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో కపిల్ సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు. "కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అనేది.. బీజేపీని కూడా ఓడించవచ్చనే సందేశాన్ని ఇచ్చింది. అంతమాత్రాన 2024 ఎన్నికలకు ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లొద్దు. లోక్‌సభ ఎన్నికలు పూర్తిగా భిన్నమైన అంశాల ప్రాతిపదికన జరుగుతాయని విపక్షాలు గుర్తుంచుకోవాలి" అని సిబల్ పేర్కొన్నారు.

“రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీకి కాంగ్రెస్ నిజమైన ప్రతిపక్షమని చెప్పారు. “తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఏదో ఒక సమస్య ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ), కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మధ్య త్రిముఖ పోటీ ఉన్నందున అక్కడ ప్రతిపక్షాల కూటమి ఏర్పడే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు కాంగ్రెస్ నేతృత్వం వహించాలా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. దీని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఆప్ రెండింటికీ జాతీయ హోదా ఉందని.. అయితే ఆప్ తక్కువ రాష్ట్రాల్లోనే విస్తరించి ఉందని సిబల్ తెలిపారు.


Similar News