Digvijaya Singh : కేంద్ర మంత్రి కుమారుడు వర్సెస్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్.. ట్వీట్ల యుద్ధం
దిశ, నేషనల్ బ్యూరో : మధ్యప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్(Shivraj Chouhan) కుమారుడు కార్తికేయ చౌహాన్ (బీజేపీ), కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) మధ్య ‘ఎక్స్’ వేదికగా వాగ్యుద్ధం నడిచింది.
దిశ, నేషనల్ బ్యూరో : మధ్యప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్(Shivraj Chouhan) కుమారుడు కార్తికేయ చౌహాన్ (బీజేపీ), కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) మధ్య ‘ఎక్స్’ వేదికగా వాగ్యుద్ధం నడిచింది. రాష్ట్రంలోని విజయ్‌పూర్, బుధ్ని అసెంబ్లీ స్థానాలకు నవంబరు 13న ఉప ఎన్నిక జరగబోతోంది. ఈసందర్భంగా ఇటీవలే బుధ్నిలో బీజేపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ కార్తికేయ చౌహాన్(Kartikey Chouhan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్.. ఇక నుంచి ఇలాంటి ప్రసంగాలు చేయొద్దని హితవు పలికారు. ‘‘శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి నేర్చుకో కార్తికేయ. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తేనే దేశ నిర్మాణం జరుగుతుంది. నేను పదేళ్లు సీఎంగా వ్యవహరించాను. కానీ ఎన్నడూ నీలా నోరుపారేసుకోలేదు’’ అని దిగ్విజయ్ విమర్శించారు.
‘‘మీ నాన్నకు అన్నీ తెలుసు. కనీసం ఆయనను చూసి నేర్చుకో. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామంలో ప్రభుత్వ నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్‌దే. ఎమ్మెల్యేది కాదు. నువ్వు సర్పంచ్‌వు కాదు.. ఎమ్మెల్యేవి కూడా కాదు. కానీ నా మనవడి లాంటి వాడివి. నేను చెప్పేది నమ్మాలా వద్దా అనేది నీ ఇష్టం’’ అని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు కార్తికేయ చౌహాన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘దిగ్విజయ్‌జీ మీరు పదేళ్లు సీఎంగా పనిచేసినా.. ఆ పాలనా కాలం నుంచి నేర్చుకోవడానికి మాకు ఏమీ మిగల్లేదు’’ అని స్పష్టం చేశారు.