UP: కనిపిస్తే కాల్చిపారేయండి..! యోగీ సర్కార్ సంచలన ఆదేశాలు

Update: 2024-09-03 08:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లో తోడేళ్లు ప్రజలపై దాడి చేస్తున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కనిపిస్తే కాల్చి పారేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా బహరాయిచ్ జిల్లా ప్రజలపై తోడేళ్ల గుంపు దాడి చేస్తోంది. ఈ జీవాల దాడిలో ఇప్పటివరకు 10 మంది మరణించగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. తోడేళ్లను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం అటవీ శాఖతో కలిసి "ఆపరేషన్ భేడియా" ను చేపట్టింది. ఈ ఆపరేషన్ లో తోడేళ్లను పట్టుకునేందుకు అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నాలుగు తోడేళ్లు మాత్రమే పట్టుకోగలిగారు.

ఆరు తోడేళ్లు ఉండగా.. నాలిగింటిని పట్టుకున్నామని, మిగిలినా రెండు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిక్కడం లేదని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అంతేగాక తోడేళ్లు ఎప్పటికప్పుడు వాటి వ్యూహాన్ని మార్చుకుంటున్నాయని, రెండు రోజులకు ఒక కొత్త గ్రామాన్ని ఎంచుకొని దాడి చేస్తున్నాయని తెలిపారు. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలపై తోడేళ్ల దాడులు ఆగడం లేదని, సోమవారం రాత్రి కూడా ఓ చిన్నారిపై దాడి చేసి గాయపరిచాయని పేర్కొన్నారు. దీంతో యోగీ సర్కార్ అటవీ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. తోడేళ్లు పట్టుకోవడం సాధ్యం కాని తరుణంలో వాటిని కాల్చివేయాలని చెప్పింది. అయితే ఇది చివరి అవకాశంగా మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెళువరించాయి.


Similar News