UP: మ్యాన్ ఈటర్ తోడేలును పట్టుకున్న అటవీశాఖ
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో దాదాపు 50,000 మంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న తోడేళ్ల గుంపులో ఒకదానిని గురువారం అక్కడి అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో దాదాపు 50,000 మంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న తోడేళ్ల గుంపులో ఒకదానిని గురువారం అక్కడి అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. గత 45 రోజులుగా కొన్ని తోడేళ్లు జిల్లాలోని దాదాపు 25 నుంచి 30 గ్రామాల్లో తిరుగుతూ స్థానికులను చంపేస్తున్నాయి. బహ్రైచ్ ప్రాంతంలో ఆరుగురు పిల్లలు, ఒక మహిళతో సహా ఎనిమిది మంది వ్యక్తులను ఈ గుంపు తోడేళ్లు చంపగా, మరో 25 మందిని గాయపరిచాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రోజు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. దీంతో ఆ గుంపును పట్టుకోవడానికి 16 బృందాలతో 'ఆపరేషన్ భేదియా'ను ప్రారంభించారు.
గురువారం ఉదయం సీసయ్య చూడామణి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో ఒక మగ తోడేలు చిక్కుకుంది. ఈ ఆపరేషన్‌కు ఇన్‌ఛార్జ్ బారాబంకి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) ఆకాష్‌దీప్ బధవాన్ మాట్లాడుతూ, తేడేళ్ల గుంపులో తాజాగా పట్టుకున్న కిల్లర్ తోడేలుతో కలిపి ఇప్పటి వరకు నాలుగింటిని పట్టుకున్నాం, మరో రెండింటిని పట్టుకోవాల్సి ఉందని అన్నారు. మిగిలిన తోడేళ్లను కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. తోడేళ్లను పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ మ్యాపింగ్ టెక్నిక్‌లను ఉపయోగిస్తున్నారు.