Ukraine : ఉక్రెయిన్ చేతికి లేజర్ ఆయుధాలు.. ఏం జరగబోతోంది ?
దిశ, నేషనల్ బ్యూరో : రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్(Ukraine) కీలక పురోగతిని సాధించింది. ‘ట్రైజుబ్’ పేరుతో అత్యాధునిక లేజర్ ఆయుధాన్ని(Laser Weapon) అభివృద్ధి చేశామని ఉక్రెయిన్ మానవరహిత వ్యవస్థల కమాండర్ వాడిమ్ సుఖరేవస్కీ వెల్లడించారు.
దిశ, నేషనల్ బ్యూరో : రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్(Ukraine) కీలక పురోగతిని సాధించింది. ‘ట్రైజుబ్’ పేరుతో అత్యాధునిక లేజర్ ఆయుధాన్ని(Laser Weapon) అభివృద్ధి చేశామని ఉక్రెయిన్ మానవరహిత వ్యవస్థల కమాండర్ వాడిమ్ సుఖరేవస్కీ వెల్లడించారు. గగనతలంలో దూసుకొచ్చే ముప్పు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించి కూల్చేయడం ‘ట్రైజుబ్’ ప్రత్యేకత అని ఆయన తెలిపారు. ఈ ఆయుధాన్ని వాడి తాము యుద్ధ విమానాలను కూల్చేయగలమన్నారు. ట్రైజుబ్ అంటే త్రిశూలం అని అర్థం. అమెరికా నౌకాదళంలో ఇలాంటి లేజర్ ఆయుధాలను 2014 సంవత్సరం నుంచే వినియోగిస్తున్నారని బెల్జియంలోని ఆర్మమెంట్ రీసెర్చి సర్వీస్‌కు చెందిన పాట్రిక్ స్నెఫ్ట్ గుర్తుచేశారు. శతఘ్ని గుండ్లు, బాలిస్టిక్ క్షిపణులు ఉష్ణాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం ఉండటంతో వాటిపై ఈ లేజర్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నారు. సుదూరంగా ఉన్న లక్ష్యాలను కూల్చే సమయంలో భారీగా శక్తిని కోల్పోవడం అనేది ‘ట్రైజుబ్’లోని ప్రధాన లోపంగా పేర్కొన్నారు.
లేజర్ బీమ్ శక్తి, కూలింగ్ వ్యవస్థలు, మేఘాలు, వర్షం వంటివి దీని పనితీరును ప్రభావితం చేస్తాయని నార్వేలోని ఓస్లో న్యూక్లియర్ ప్రాజెక్టుకు చెందిన ఫబియన్ హఫ్‌మన్ తెలిపారు. థర్మల్ బ్లూమింగ్ అనే ప్రత్యేక పరిస్థితి కారణంగా లేజర్ పుంజం ప్రయాణించే మార్గం చుట్టుపక్కల గాలి వేడెక్కుతుందన్నారు. ఫలితంగా ఆ కిరణం సామర్థ్యం తగ్గిపోతుందని విశ్లేషించారు. ప్రస్తుతం లేజర్ ఆయుధాలు అమెరికా, ఇజ్రాయెల్, చైనా దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం డ్రాగన్ ఫైర్ సిస్టమ్ తయారీపై బ్రిటన్ పనిచేస్తోంది. ఈ వ్యవస్థ 2027 నాటికి సిద్ధమవుతుందని అంటున్నారు.