Dharam Sansad : ‘ధర్మ సంసద్‌’‌ను ఆపాలంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ (Ghaziabad)‌లో ఈనెల 17 నుంచి జరుగుతున్న ధర్మ సంసద్‌‌(Dharam Sansad)పై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2024-12-19 11:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ (Ghaziabad)‌లో ఈనెల 17 నుంచి జరుగుతున్న ధర్మ సంసద్‌‌(Dharam Sansad)పై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ధర్మ సంసద్ నిర్వహణను ఆపలేమని స్పష్టం చేసింది. అయితే అక్కడ జరిగే ప్రసంగాలను నిశితంగా పరిశీలించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, గజియాబాద్ జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆర్డర్స్ ఇచ్చింది. ‘‘ఈ తరహా పిటిషన్లను మేం నేరుగా విచారణకు స్వీకరించలేం. ఒకసారి ఇలాంటి పిటిషన్లను మేం నేరుగా విచారణకు స్వీకరిస్తే.. ఇలాంటి చాలా పిటిషన్లు మా ఎదుట క్యూ కడతాయి’’ అని సుప్రీంకోర్టు బెంచ్ కామెంట్ చేసింది. కావాలంటే ఈ అంశంపై ఉత్తరప్రదేశ్‌లోని హైకోర్టును సంప్రదించాలని పిటిషనర్లకు సూచించింది.

‘‘ఈ పిటిషన్‌ను మేం తోసిపుచ్చుతున్నామంటే.. ధర్మ సంసద్‌లో ఏది జరిగినా ఫర్వాలేదు అని అర్ధం కాదు. ఆ జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు ధర్మ సంసద్‌ను పర్యవేక్షించాలి. విద్వేష పూరిత ప్రసంగాలకు తావులేకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి’’ అని సుప్రీంకోర్టు బెంచ్ నిర్దేశించింది. తమ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌‌కు న్యాయస్థానం సూచించింది. ఇక ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వారిలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అరుణా రాయ్, మాజీ ప్రణాళికా సంఘం సభ్యుడు సయ్యదా హమీద్ ఉన్నారు. వివాదాస్పద ప్రసంగాలకు పేరుగాంచిన యతి నరసింఘానంద్(Yati Narasinghanand) ఏటా గజియాబాద్‌లో ధర్మ సంసద్‌‌ నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమం కోసం ఇటీవలే గజియాబాద్‌లో ఇచ్చిన ప్రకటనల్లో ఇరువర్గాల ప్రజలను రెచ్చగొట్టేలా హింసాత్మక సందేశాలు ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించారు. వాటిని గజియాబాద్ పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం అడ్డుకోలేదన్నారు.

Tags:    

Similar News