Illness: జమ్మూ కశ్మీర్‌లో కలకలం.. అంతుచిక్కని వ్యాధితో 8 మంది మృతి

జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భయాందోళన వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని వ్యాధి సోకి 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-12-19 12:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir)లోని రాజౌరీ (Rajoury) జిల్లాలో భయాందోళన వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని వ్యాధి సోకి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజుల నుంచి మరణాలు సంభవిస్తుండగా తాజాగా ఓ ఆస్పత్రిలో చిన్నారి మరణించడంతో కలకలం రేగింది. ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై దర్యాప్తు చేయడానికి కేంద్ర నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షలను వేగవంతం చేసి వ్యాధిని గుర్తించడానికి బయోసేఫ్టీ లెవల్ 3 (Bio safety) మొబైల్ ల్యాబ్‌ను రాజౌరీకి పంపించారు. అంతేగాక మరణాలపై ఇన్వెస్టిగేషన్ చేయడానికి కేంద్ర బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే గుర్తు తెలియని వ్యాధితో మరణించిన వారిలో ఏడుగురు 14 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.

మృతులందరిదీ ఒకే గ్రామం

మరణించిన వారంతా కోట్రంక తహసీల్‌లోని బదాల్ (Badal) గ్రామానికి చెందిన వారేనని అధికారులు వెల్లడించారు. ఇందులో రెండు కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్టు తెలిపారు. అష్ఫాక్ అహ్మద్ (12) అనే బాలుడు జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ తాజాగా మరణించాడు. అష్ఫాక్ ఈ వ్యాధి బారిన పడి గత 6 రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. అంతకుముందు అష్ఫాక్ సోదరుడు ఇష్తియాక్(7), సోదరి నజియా (5)తో పాటు మరో ఐదుగురు అదే వ్యాధి కారణంగా మృతి చెందారు. వ్యాధి అంతుచిక్కక పోవడంతో అధికారులు అప్రమత్తమై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Tags:    

Similar News