Gadkari: లివ్ ఇన్ రిలేషన్‌షిప్ కాన్సెప్ట్ తప్పు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
లివ్-ఇన్ రిలేషన్ షిప్, స్వలింగ వివాహాలు అనేవి సమాజ నిర్మాణాన్ని నాశనం చేస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: లివ్-ఇన్ రిలేషన్ షిప్ (live-in relationship), స్వలింగ వివాహాలు (Same sex marriage) అనేవి సమాజ నిర్మాణాన్ని నాశనం చేస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nithin gadkaree) అన్నారు. ఈ కాన్సెప్ట్ సమాజ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘గతంలో లండన్‌లోని బ్రిటన్ పార్లమెంటు(Britan parliament)ను సందర్శించాను. ఈ సమయంలో బ్రిటన్ ప్రధాని, విదేశాంగ మంత్రిని వారి దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల గురించి అడిగాను. ఐరోపా దేశాల్లో ఉన్న పెద్ద సమస్య స్త్రీ పురుషులు వివాహం పట్ల ఆసక్తి చూపకపోవడం, లివ్-ఇన్ రిలేషన్‌షిప్ లను ఇష్టపడటం అని అప్పుడు తెలిసింది. కానీ ఇది ముమ్మటికీ సరైంది కాదు. సామాజిక జీవన శైలిని విచ్ఛిన్నం చేస్తే అది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని వ్యాఖ్యానించారు.
భారత్‌లో పిల్లల నిష్పత్తిపై అడిగిన ప్రశ్నకు గడ్కరీ స్పందిస్తూ.. పిల్లలను కని వారిని సరిగ్గా పెంచడం తల్లిదండ్రుల కర్తవ్యమని తెలిపారు. కానీ సరదాకోసమే పిల్లలని కని, బాధ్యత తీసుకోకూడదని చెబితే అది సరికాదన్నారు. ప్రతి1000 మంది పురుషులకు 1500 మంది మహిళలు ఉన్నట్లయితే, పురుషులు ఇద్దరు భార్యలను కలిగి ఉండేందుకు అనుమతించాల్సి ఉంటుందన్నారు. ఇది సామాజిక పతనానికి దారి తీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.