నక్సల్స్‌ అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది

Update: 2024-07-18 05:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలో అటవీ ప్రాంతంలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో గురువారం ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) కానిస్టేబుళ్లు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారని బస్తర్ పోలీసులు తెలిపారు. జిల్లాలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా తార్రెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిమార్క అడవుల్లో పేలుడు సంభవించింది.

మరణించిన కానిస్టేబుళ్లను రాయ్‌పూర్‌కు చెందిన భరత్ సాహు, నారాయణపూర్‌కు చెందిన సత్యర్ సింగ్ కాంగేగా అధికారులు గుర్తించారు. గాయపడిన వారు.. పురుషోత్తం నాగ్, కోమల్ యాదవ్, సియారామ్ సోరి, సంజయ్ కుమార్. ప్రస్తుతం వీరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు విమానంలో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అదనపు భద్రతా బలగాలను అక్కడికి పంపారు.

బుధవారం మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసులతో జరిగిన కాల్పుల్లో 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఈ ఘటనలో మావోయిస్టుల మృతదేహాలు పాటు, భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది కుంబింగ్ చేస్తున్నారు. బీజాపూర్, దంతేవాడ, సుక్మా మధ్య ఎస్టీఎఫ్, డీఆర్‌జీ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ బృందాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి.


Similar News