జేడీయూకు రెండు కేబినెట్ బెర్త్‌‌లు..లలన్‌సింగ్, రామ్ నాథ్ ఠాకూర్‌ల పేర్లు ప్రతిపాదన!

ప్రధాని మోడీ నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త మంత్రి వర్గంపై సర్వత్రా ఆసక్తిగా ఉన్నారు. ఎవరికి ఏయే పదువులు వస్తాయి, కీలక శాఖలకు బాధ్యతలు నిర్వర్తించే చాన్స్ ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Update: 2024-06-08 10:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త మంత్రి వర్గంపై సర్వత్రా ఆసక్తిగా ఉన్నారు. ఎవరికి ఏయే పదవులు వస్తాయి, కీలక శాఖలకు బాధ్యతలు నిర్వర్తించే చాన్స్ ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన నితీశ్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఎంపీలు లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్‌ల పేర్లను పార్టీ ఇప్పటికే ప్రతిపాదించినట్టు సమాచారం. రేపు మోడీ ప్రమాణస్వీకారానికి ముందు నిర్వహించే ఎన్డీయే సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది. లలన్ సింగ్ బిహార్‌లోని ముంగేర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నిక కాగా, రామ్ నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రామ్ నాథ్ భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు కావడం గమనార్హం. కాగా, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 240 స్థానాలు రాగా, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన టీడీపీ 16, జేడీయూ 14 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారిన విషయం తెలిసిందే.


Similar News